మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో నకిలీ పోడు పట్టాల దందా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులను సూత్రధారులుగా అటవీ అధికారులు గుర్తించారు.ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. అటవీ ప్రాంత రైతులను దారుణంగా మోసం చేసిన ఈ ఘటనలో నిందితుల్లో ఆరుగురు గిరిజనులే కావడం గమనార్హం.
అటవీ అధికారుల కథనం ప్రకారం..వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్గుంపురం గ్రామానికి చెందిన చాందావత్ భద్రు ములుగు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన గిరిజనులను టార్గెట్ చేశాడు. ఇందులో భాగంగానే రైతుల నుంచి అక్రమంగా డబ్బు వసూల్ చేసి నకిలీ పోడు పట్టాల దందాకు తెర తీశాడు.
వరంగల్ నగరానికి చెందిన గణేష్ ప్రింటర్స్ యజమాని తాటిపాముల రాజు నకిలీ పోడు పట్టాల పాస్ పుస్తకాలను ప్రింట్ చేసేందుకు ఒక్కో పాస్ బుక్ కు రూ. 2 వేల చొప్పున తీసుకున్నాడు. ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకుడు భూక్యా వెంకన్న క్యూ ఆర్ కోడ్ ను క్రియేట్ చేశాడు. మానుకోటకు చెందిన బానోత్ హరినాయక్ హోలో గ్రామ్ తయారు చేశాడు.
అదేవిధంగా నర్సంపేటకు చెందిన ధారావత్ కిషన్ బ్యాంకు రుణాల కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తద్వారా క్లియరెన్స్ సర్టిఫికెట్ ను రూపొందించాడు. వెంకటాపూర్ మండలం ఇంచంచెర్వుపల్లికి చెందిన ఝాటోత్ రాజ్ కుమార్ అటవీ హక్కు పత్రం పాస్ పుస్తకం నమూనాను పంపించాడు.
ములుగు మండలం కాశిందేవిపేటకు చెందిన వాంకుడోత్ రవి ఏజెంటుగా వ్యవహరిస్తూ పోడు భూముల పట్టా పాస్ బుక్ కావాలన్నవారి నుంచి డబ్బులు వసూల్ చేసి భద్రుకు పంపేవాడు. మొత్తం ఏడుగురు వ్యక్తులు ఈ దందాలో అత్యంత కీలకంగా వ్యవహరించారని అటవీ అధికారుల కథనం. బ్యాంకులో రుణాలు పొందడానికి నకిలీ పోడు పట్టాల పాస్ బుక్కులను తయారు చేసినట్లు అటవీ అధికారుల విచారణలో తేలింది.
కాగా అటవీ హక్కుల పోడు పట్టాల సమాచారం ఆన్ లైన్ లో లేకపోవడమే నిందితుల నకిలీ దందాకు కారణంగా తెలుస్తోంది. ములుగు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఈ ముఠా బారిన పడినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా అటవీ అధికారి (ఎఫ్ డీ వో) సంతకాన్ని కూడా నిందితులు ఫోర్జరీ చేసి పాస్ పుస్తకాలను తయారు చేసినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి సీతక్క పోలీసులను ఆదేశించారు.