ములుగు జిల్లా మేడారం గ్రామాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న జంపన్న వాగు…
చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రామన్నే చుట్టేసిన వర్షపు నీరు..
ప్రస్తుతం మేడారం గద్దెల సమీపంలోని ఐటిడీఏ కార్యాలయానికి తాకిన జంపన్న వాగు నీరు…
ఇప్పటికే పూర్తిగా స్తంబించింది జనజీవనం…
పస్రా నుండి మేడారంకు రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలుపుదల చేసిన పోలీసులు…
ఊరట్టం వద్ద భారీగా వెలుతున్న జంపన్న వాగు నీరు…
మేడారం గ్రామం బ్రిడ్జీపై నుండి గ్రామంలోకి చేరుతున్న వరద నీరు…
మరి కాసేపట్లో మేడారం అమ్మవార్ల గద్దెలను తకనున్న జంపన్న…
ఇప్పటికే చిలుకల గుట్టను తాకి గద్దెలవైపుగా పయనిస్తున్న జంపన్న వాగు…
చదివారు కదా? గడచిన రెండు రోజులుగా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. అనేక భాషా దోషాలు కూడా ఉన్నాయన్నది వేరే విషయం. కానీ ఈ పోస్టులోని సారాంశం నిజమేననుకుని కొందరు ‘వెబ్ సైట్’ సోదరులు అత్యుత్సాహంతో వార్తగా వాడేసుకున్నారు కూడా.
విషయమేమిటంటే ఇది సోషల్ మీడియా దురదకు పరాకాష్టగా అభివర్ణించవచ్చు. వర్షాలు, వరదలకు సంబంధించి ఉప్పొంగుతున్న ‘ఫేక్’ న్యూస్ బురద అన్నమాట.
మేడారం గ్రామాన్ని జంపన్నవాగు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నదట. చరిత్రలో మొదటిసారి గ్రామాన్ని వర్షపు నీరు చుట్టేసిందట. మేడారం గద్దెల వద్ద గల ఐటీడీఏ కార్యాలయాన్ని జంపన్నవాగు నీరు తాకిందట. ఊరట్టం వద్ద జంపన్నవాగు నీరు భారీగా వెడుతోందట. మేడారం అమ్మవార్ల గద్దెలను తాకనున్న జంపన్న…
జంపన్నవాగు మేడారాన్ని ఆధీనంలోకి తీసుకోవడమేంటో…? అమ్మవార్ల గద్దెలను తాకడమేంటో…? మేడారం భౌతిక స్థితి గురించి తెలిసినవారెవరైనా ఫక్కున నవ్వుకోక తప్పదు. అమ్మవార్ల గద్దెలను జంపన్నవాగు నీరు తాకడమంటూ జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లా యావత్తూ సముద్రంగా మారుతుందని స్థానికులు ఏటా వర్షాకాలపు వరదల సందర్భంగా చెబుతుంటారు.
అంతేగాక మేడారంలో గల ఐటీడీఏ కార్యాలయాన్ని కూడా జంపన్నవాగు నీరు తాకిందట. మేడారానికి 30 కిలోమీటర్ల దూరంలో గల ఏటూరునాగారంలోని ఐటీడీఏ మేడారానికి ఎందుకు నడిచి వచ్చిందో ఎంతకీ అర్థం కాదు. అసలు ఐటీడీఏ కార్యాలయం ఎక్కడ ఉందనే విషయాన్ని ఆయా పోస్టు క్రియేటర్ కనుగొనకపోవడమే అసలు విశేషం. ఇక ఊరట్టం వద్ద జంపన్నవాగు నీరు భారీగా వెడుతోందట. జంపన్నవాగుకు ఊరట్టానికి సంబంధమేంటో ఎంతకీ బోధపడదు. కాల్వపల్లి వాగుకు, జంపన్నవాగుకు తేడా తెలియని పైత్యమన్నమాట.
సరే… పనీపాటా లేనివాడు ఆయా పోస్టును తయారు చేసి సోషల్ మీడియాలోకి వదిలాడని కాసేపు అనుకుందాం. కానీ దిగువన గల ఫొటోలను ఓసారి చూడండి. ఆయా దృశ్యాలు ‘ములుగు వద్ద’ అనే ట్యాగ్ లైన్ తో ఫేక్ న్యూస్ ప్రియులు వదలడంతో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇసుక మేటల్లో కూరుకుపోయిన వాహనాల ఫొటోలు ఇవి. కానీ ములుగు వద్ద అవి ఎక్కడివనే విషయాన్ని ప్రస్తావించకపోవడమే సోషల్ మీడియా క్రియేటివిటీ ప్రత్యేకత. ఇటువంటి ఫేక్ న్యూస్ బురదను జర్నలిస్టులుగా చెప్పుకునేవారే కొందరు తమ వెబ్ సైట్లలో రాసుకుని, పూసుకోవడమే అసలు విషాదం.