‘‘నకిలీ నోట్ల కోసం నా వద్దకు వచ్చేవాడు రిజర్వు బ్యాంకును మోసం చేస్తున్నట్లేగా? నేను వారిని మోసం చేస్తే తప్పేమిటి? నా వద్ద నకిలీ నోట్లు తీసుకుంటున్నవాళ్లు ఇతరులను వంచనకు గురి చేస్తున్నట్లేగా? వారిని నేను వంచించడం సబబు కాదా??’’ ఇది వాదనో…వింత వాదనో…వితండ వాదనోగాని…లాజిక్ గానే ఉందనిపిస్తోందా? లేక నవ్వు తెప్పిస్తున్నదా?  అక్షరాలా రూ. ఏడు కోట్ల నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు షేక్ మదార్ బహిరంగ వాదన ఇది. తాను పాకిస్థాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో దిగుమతి అవుతున్న దొంగనోట్లను చెలామణి చేయడం లేదని, నకిలీ నోట్లను మాత్రమే ఇస్తూ మోసం చేస్తున్నానని అంటాడు మదార్. ఇంతకీ దొంగ నోట్లకు, నకిలీ నోట్లకు తేడా ఏమిటి? అనే ప్రశ్న ఉద్భవిస్తున్నదా? అసలు నోటుకు తీసిపోని విధంగా అవే ఫీచర్లతో ఉంటే అది దొంగ నోటు…అసలు నోటును పోలి ఉండి ఎటువంటి ఫీచర్లు లేకుంటే అది నకిలీ నోటు అనేది ఓ పోలీసు అధికారి విశ్లేషణ.

సత్తుపల్లి మండలం గౌరిగూడేనికి చెందిన షేక్ మదార్ నకిలీ నోట్ల చెలామణిలో సిద్ధహస్తుడు. ఒకటి కాదు రెండు కాదు అనేక కేసులు అతనిపై నమోదై ఉన్నాయి. రెండు దశాబ్ధాలుగా నకిలీ నోట్లను చెలామణి చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. నకిలీ కరెన్సీని చెలామణి చేయడంలో అంతర్రాష్ట్ర స్థాయికి ఎదిగాడు. కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. తన ఇంటినే కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీని తయారు చేయడంలో మదార్ సిద్ధహస్తుడు. అతను తయారు చేసే నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. గాంధీ బొమ్మ పక్కన స్పెసిమెన్ అనే అక్షరాలూ కనిపిస్తాయి. టూ థౌజండ్ రూపీస్ అనే అక్షరాలకు బదులు టూ థౌజండ్ పాయింట్స్ అని కనిపిస్తుంది. ఈ ఫీచర్ల వల్లే వీటిని పోలీసులు నకిలీ నోట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే చిన్నపిల్లల రిజర్వు బ్యాంకు పేరుతో పెద్దలను లక్షల, కోట్ల రూపాయల్లో మోసం చేస్తున్న మదార్ మోసపు జీవితానికి మరో కోణం కూడా ఉంది. వాస్తవానికి మదార్ వాలీబాల్ ప్లేయర్. దాదాపు 30 ఏళ్ల క్రితం దొంగనోట్ల పేరుతో మదార్ మోసపోయాడట. ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన కింద రుణం తీసుకుని చిన్నా, చితకా వ్యాపారం చేసుకునే మదార్ దొంగనోట్ల బాగోతంలో మోసపోయి తాను కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడట. మదార్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులోఇద్దరిని విదేశాల్లో విద్యాభ్యాసం కోసం పంపాడట. వారిద్దరూ ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు సమాచారం. మరో కుమారుడు మదార్ ‘వ్యాపార’ కార్యకలాపాలకు చేదోడు, వాదోడుగా ఉంటాడట. నకిలీ కరెన్సీ బాగోతంలో ఎప్పడు, ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేసినా మదార్ ఏమీ దాచి పెట్టడట. ‘నకిలీ నోట్ల కోసం నా వద్దకు వచ్చేవారు మోసకారులే కదా? వారిని నేను మోసం చేస్తున్నాను.’ అని అంగీకరిస్తాడట. తమదైన శైలి మర్యాద చేసే అవకాశం కూడా మదార్ పోలీసులకు ఇవ్వడట. రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ మదార్ పై అనేక కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాను చేసేది దొంగనోట్ల వ్యాపారం కాదని, దొంగనోట్లను చెలామణి చేస్తే దేశద్రోహం అవుతుందని మదార్ బహిరంగంగానే చెబుతుంటాడు. తాను నకిలీ నోట్లను మాత్రమే చేస్తున్నానని, ఇది మోసం కిందకు మాత్రమే వస్తుందని, వారం రోజుల్లో బెయిల్ వస్తుందని, మహా అయితే నెల రోజులు రిమాండ్ లో ఉంటానని మదార్ ధీమాను వ్యక్తం చేస్తుంటాడట. ఇప్పటివరకు దాదాపు 14 కేసుల్లో నిందితుడైన మదార్ కార్యకలాపాలను నిలువరించే దిశగా ఖమ్మం పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. మదార్ పై పీడీ యాక్ట్ నమోదు అవకాశాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

తాజాగా మదార్ అరెస్ట్ ఎపిసోడ్ లో అసలు విషయం మరింత ఆసక్తికరం. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బిగ్ షాట్ మదార్ వలలో చిక్కుకున్నాడట. రూ. 15.00 కోట్ల నకిలీ నోట్ల సరఫరాకు డీల్ కుదుర్చుకున్నాడట. ఇందులో 30 శాతం అంటే రమారమి రూ. 4.50 కోట్ల నగదు మొత్తాన్ని సదరు బిగ్ షాట్ మదార్ చేతిలో పెట్టాడట. ఇంకేముంది ’కత‘ షరా మామూలే. మదార్ తప్పించుకుని తిరుగుతుండడంతో తనకు తెలిసిన ఓ పెద్ద పోలీసు అధికారిని బిగ్ షాట్ ఆశ్రయించాడట. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసిన ఫలితంగానే మదార్ అరెస్ట్, రూ. 7.00 కోట్ల నకిలీ నోట్ల స్వాధీనం వంటి ప్రక్రియ చకచకా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. మదార్ లాజిక్ లో నిజం ఉంది కదూ? రూ. 4.50 కోట్ల అసలు కరెన్సీ చెల్లించి రూ. 15.00 కోట్ల నకిలీ నోట్లను చెలామణిలోకి తీసుకురావడానికి యత్నించిన బిగ్ షాట్ ను మదార్ మోసం చేయడం సబబా? కాదా?

(నోట్: ఇది నిందితున్ని, అతని చర్యలను సమర్థించే కథనం కాదు. మోసం చేసే గుణం ఉన్నవాళ్లు మోసానికే బలి అవుతారనే నీతిని గుర్తు చేయడం మాత్రమే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతే…)

Comments are closed.

Exit mobile version