అఘోరాలు….అక్కడెక్కడో ఉంటూ…శవాలను పీక్కు తింటూ… స్మశానాల్లో జీవనం గడుపుతుంటారని విన్నాం…చదివాం. అది అసలు సిసలైన అఘోరాల జీవనశైలి…సీన్ కట్ చేస్తే…
ఇక్కడ నకిలీ అఘోరాలు రాజ్యం ఏలుతున్నారు. ఆఘోరాల రూపంలో మకిలీ వేషాలు వేస్తున్నారు. బతికి ఉన్న మనుషులను ఆర్థికంగా పీక్కు తింటున్నారు. పట్ట పగలే ప్రజలను దోచుకుంటున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు… తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో నివసించే కొందరు జ్యోతిష్యం పేరుతో పలువురిని వంచనకు గురి చేస్తున్నారు. పూజల పేరుతో క్షుద్ర పూజలను మైమరపిస్తున్నారు. నీటిలో నడిపిస్తామని, గాల్లో పరుగులు తీయిస్తామని అబ్రకదబ్ర వేషాలు వేస్తున్నారు. ఖమ్మం పరిసరాల్లోని చెట్లు, చేమల్లో, ఎంచుకున్న చెట్ల వద్ద ఈ నకిలీ అఘోరాలు చేస్తున్న పూజలు పరిసర ప్రాంత ప్రజలను భీతావహానికి గురి చేస్తున్నాయి. క్షుద్ర పూజలను తలపించే విధంగా జంతు బలులను కూడా ఇస్తూ నకిలీ అఘోరాలు చేస్తున్న ఘోరాలు పలువురిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సామాన్య జన జీవనానికి భంగకరంగా పరిణమించిన ఈ నకిలీ అఘోరాలు అకృత్యాలు అన్నీ… ఇన్నీ కావంటున్నారు. ఒళ్ళు గగుర్పొడిచే గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా విద్యలతో తెలంగాణలోని పలువురినే గాక విదేశీయులను సైతం మోసం చేస్తున్నట్లు సమాచారం. జ్యోతిష్యం పేరుతో నకిలీ అఘోరాలు చేస్తున్న పూజలు సామాన్యులను భయకంపితులను చేస్తుండగా, వీరిని నమ్మి ఆశ్రయించిన డబ్బు గల వారి ఖజానాను డొల్లగా మారుస్తున్నాయి. సుమారు రెండేళ్ళ క్రితం వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబాన్ని ఇదే తరహాలో మోసం చేసిన ఘటన అప్పట్లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోయదొరల పేరుతో పూజలు చేస్తామంటూ ఎమ్మెల్యే కూతురును మోసం చేసి రూ. 57 లక్షల మొత్తాన్ని వసూలు చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎనిమిది నెలలపాటు సాగినట్లు పేర్కొన్న ఈ పూజల ద్వారా మూడు విడతలుగా రూ. 57 లక్షలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు నిందితులపై ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు ఖమ్మం ప్రాంత వాసులుగా కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో నకిలీ అఘోరాలు చేస్తున్న పూజలకు సంబంధించి కొన్ని ఫోటోలు తాజాగా బహిర్గతమయ్యాయి. అయితే ఈ ఫొటోలు ఎప్పటివి? తాజాగా జరిగిన పూజలా? లేక ఇటీవల చేసిన పూజల తాలూకు దృశ్యాలా? అనేది తేలాల్సి ఉంది. ఈ నకిలీ అఘోరాల పూజల విధానం, మోసం తాలూకు పూర్తి వివరాలు మరో కథనంలో తెలుసుకుందాం.