ఖమ్మం జిల్లా కారేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పీజీ విద్యార్థి ఆత్మహత్యా ఘటన ఉదంతంలో న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముట్టడికి గ్రామస్తులు యత్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వివరాల్లోకి వెడితే… కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన పీజీ విద్యార్థి ధర్మసోత్ సుదర్శన్ (25) ఆగస్టు 3వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో మృతదేహంపై గాయాలు ఉండటం, సెల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా కుటుంబ సభ్యులు తమ కుమారుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అదే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఓ ప్రేమ విషయమై తమ కుమారుడిని హత్య చేశారని ఆరోపిస్తూ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం సుదర్శన్ కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టు ఇవ్వకపోవడం, బాధితులను విచారించక పోవడం, పెద్ద మనుషుల మధ్య సెటిల్మెంట్ చేసుకోండి అని పోలీసులు సూచించారనేది మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణ.
ఈ క్రమంలో గ్రామ పెద్ద మనుషులు రాజకీయ నాయకుల ద్వారా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని రేలకాయలపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. దాదాపు 200 మంది గ్రామస్తులు పోలీసులకు వ్యతిరేకంగా కారేపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా మృతుడు సుదర్శన్ తండ్రి రాంబాబు పెట్రోలు పోసుకుని పోలీసుల ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతన్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు. ఘటనా స్థలంలో ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి గ్రామస్తులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముట్టడికి సంబంధించిన ఉద్రిక్త దృశ్యాలను దిగువన స్లైడ్ షోలో చూడవచ్చు.