కరోనా కల్లోల పరిణామాలు… దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం. ప్రధాని మోదీ ప్రకటనకు ముందే తెలంగాణా తదితర రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు పలువురు ముఖ్యమంత్రుల వెల్లడి. ఇటువంటి పరిస్థితుల్లోనూ తెలంగాణా వ్యాప్తంగా ‘ఖరీదైన మద్యం’ వ్యాపారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో, ప్రాంతాల్లో పట్టుబడుతున్న లిక్కర్ బాటిళ్ల లెక్కలే ఇందుకు నిదర్శనం.
వాస్తవానికి గడచిన మూడు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ నిబంధనల్లో లిక్కర్ కోసం తహతహలాడిన మద్యపాన వ్యసనపరులు అనేక మంది ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి వ్యసనపరులు మానసిక రోగులుగా మారుతున్నట్లు కూడా ఆయా వార్తల సారాంశం. ఆ మధ్య నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరి ఇదే అంశంపై తెలంగాణా సీఎం కేసీఆర్ ను ప్రశ్న కూడా అడిగారు. ‘వైన్ షాపులు కూడా బందేనా సర్’ అన్నది సదరు జర్నలిస్టు ప్రశ్న. ‘అది నీకవసరమా?’ అని సీఎం ఎదురు ప్రశ్నించారన్నది వేరే విషయం.
లాక్ డౌన్ పరిణామాల్లో వైన్ షాపులకు, బార్లకు ఎక్సైజ్ అధికారులు సీళ్లు వేశారు. కానీ లిక్కర్ దందా మాత్రం ఆగడం లేదు. ‘బ్లాక్ మార్కెట్’ దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. ఖరీదైన కార్లలో, విలాసవంతమైన జీవితం గడిపే వారి చెంతకు వారి వారి స్థాయికి తగిన బ్రాండ్లే నడుచుకుంటూ వెడుతున్నాయి. ఇప్పటి వరకు పలు ఘటనల్లో పట్డుబడిన లిక్కర్ బాటిళ్ల ఖరీదు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. వైన్ షాపులకు, బార్లకు ఎక్సైజ్ శాఖ వేసిన సీళ్లు వేసినట్లే ఉన్నాయి. కానీ కోరుకున్న లిక్కర్ బ్రాండ్లు తాగుబోతుల చెంతకు మత్తుగా, మస్తుగా చేరుకుంటున్నాయి. వాటిని సేవిస్తూ ప్రభుత్వ అధికారులు కూడా పట్టుబడుతున్న ఉదంతం తాజాగా మధిరలో వెలుగు చూసింది. ఇదెలా సాధ్యం? ఇదే అంశంపై వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో గల బెల్ట్ షాపు నిర్వాహకుడు ఏమంటున్నారో తెలుసా?
‘సార్… సామాన్య మద్యపాన ప్రియులు వినియోగించే రూ. 450కి లభించే ఓసీ (ఆఫీసర్ ఛాయిస్) ప్రస్తుతం రూ. 900కు మాకు ఇస్తున్నారు. దాన్ని మేం రూ. 1,500 కు అమ్ముకోవాలట. దినసరి రూ. 500 కూలీ, నాలీ చేసుకునేవాడు రూ. 1,500 భారీ పెట్టుబడి పెట్టగలడా? రూ. వందో, యాభయ్యో తీసి ఓ 90 ఎంఎల్ తాగే అలవాటు గల కష్టజీవుల బ్రాండ్లేవీ ప్రస్తుతం మార్కెట్లో లేవు. ఉన్నా పెగ్గుల వారీగా విక్రయించే రిస్క్ మేం తీసుకోవడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో విచ్చల విడిగా ‘బ్లాక్’లో లభిస్తున్న ఖరీదైన బ్రాండ్ల మద్యం ‘బార్లా’ తెరిచిన మార్గాల నుంచే వస్తోంది. బార్లకు ముందు ‘లాక్’లకు సీళ్లు వేసిన ఎక్సైజ్ అధికారులు, అవే బార్లకు వెనుక వైపు కిచెన్ దారిని, ఏసీ దారిని మూసేశారా? ఇంత ఖరీదైన బ్రాండ్లను సాధారణ వైన్ షాపుల్లో విక్రయించే అవకాశాలు చాలా తక్కువ. అదీ గ్రామీణ జిల్లాల్లో ఆయా కాస్ట్ లీ లిక్కర్ బ్రాండ్లు దొరికే ఛాన్సే లేదు. అందువల్ల ప్రస్తుత లాక్ డౌన్ పరిణామాల్లో ఖరీదైన లిక్కర్ బ్రాండ్ల దందా నిర్వహించే ‘బ్లాక్ డాగ్’లెవరో, సాగుతున్న ‘దందా’లో చేతులు మారుతున్న డబ్బు ఎంతో మీరే అర్థం చేసుకోండి. ప్రస్తుత స్థితిలో బార్లను ఉన్నఫలంగా తనిఖీ చేసి లిక్కర్ స్టాక్ లెక్కలు పరిశీలిస్తే ‘బ్లాక్’ దందా బొక్కలన్నీ అక్కడే కనిపిస్తాయి’ అని ఆ బెల్ట్ షాపు యజమాని సోదాహరణంగా వివరించారు.
లాక్ డౌన్ పరిణామాల్లో లిక్కర్ దందాపై విషయం మొత్తం అర్థమైనట్లే కదా…? ఇంకా అర్థం కాకుంటే దిగువన గల వీడియోను చూసైనా అర్థం చేసుకోండి.