జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నదేమిటి? అధికార టీఆర్ఎస్ పార్టీకే గ్రేటర్ ఓటర్లు పట్టం కట్టారనేది ఫలితాల సారాంశం. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ గులాబీ పార్టీకి మున్ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెబుతున్నాయనేది సుస్పష్టం. పలు సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను క్లుప్తంగా పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతోంది.
ముందుగా ‘పీపుల్స్ పల్స్’ అనే సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలిద్దాం. ఈ సంస్థ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ 68-78, బీజేపీ 25-35 మధ్య సీట్లను గెలవబోతోంది. ఓట్ షేర్ శాతాన్ని చూస్తే టీఆర్ఎస్ 38 శాతం, బీజేపీ 32 శాతం ఓట్లను పొందబోతున్నాయి. అంటే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ వ్యత్యాసం 6 శాతం మాత్రమే.
అదేవిధంగా ‘ఆరా’ అనే సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే… 40.08 శాతం ఓట్ల ద్వారా టీఆర్ఎస్ 78 స్థానాల్లో, 31.21 శాతం ఓట్లతో బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య సుమారు 9 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
ఇక సీపీఎస్ అనే మరో సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్ 82-96 డివిజన్లలో, బీజేపీ 12-20 డివిజన్లలో విజయం సాధించబోతున్నాయి. ఈ సంస్థ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ 39.8 శాతం, బీజేపీ 27.9 శాతం ఓట్లను తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఈ నివేదికలోనూ టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 11.9 శాతం మాత్రమే.
ఇప్పటి వరకు అందుబాటులో గల ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్ నివేదికలు చెబుతున్న అసలు సారాంశమేమిటి? ఇదీ రాజకీయంగా చర్చకు దారి తీసే అసలు ప్రశ్న. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం నాలుగు డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పట్టం గట్టిన ‘ఎగ్జిట్ పోల్’ నివేదికలు మాత్రం బీజేపీ గెల్చుకునే డివిజన్ల సంఖ్య మొత్తంగా, కాస్త అటూ, ఇటుగా 30 స్థానాల వరకు ఉండవచ్చనే చెబుతున్నాయి.
వంద డివిజన్లలో గెలిస్తే తప్ప బీజేపీ మేయర్ స్థానాన్ని దక్కిచుకోలేకపోవచ్చు. కానీ నాలుగు డివిజన్ల నుంచి 30 డివిజన్ల వరకు బీజేపీ ఎదిగినట్లు ఎగ్జిట్ పోల్ నివేదికల్లో టీఆర్ఎస్ కు పట్టం గట్టిన సర్వే సంస్థలు చెప్పకనే చెబుతున్నాయి. మొన్నటి దుబ్బాక విజయం, నేటి గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి చేరువగా బలపడిన అంశాలు సహజంగానే బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతాయనడంలో సందేహం లేదు.
మరో ముఖ్యాంశాన్ని కూడా రాజకీయ పరిశీలకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏ ఎగ్జిట్ పోల్ నివేదిక చూసినా టీఆర్ఎస్ పక్కనే బీజేపీ ఉంది తప్ప, కాంగ్రెస్ కాదు. పాతబస్తీలోనూ ఎంఐఎం పక్కనే బీజేపీ ఓట్ల శాతం ఉండే అవకాశం ఉందంటున్నారు. మిగతా ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నగర వ్యాప్తంగా ఓటమి చెందిన డివిజన్లలోనూ బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందంటున్నారు. ఎన్నికల ప్రచారంలో గ్రేటర్ మేయర్ పీఠాన్ని అధిష్టిస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటించవచ్చు. కానీ వాస్తవం ఏమిటో అంతర్గతంగా ఆ పార్టీ నేతలకు తెలియనిదిదేమీ కాదు.
కానీ, తెలంగాణాలో బీజేపీ ఎంచుకున్న టార్గెట్ ఒకటే. ప్రస్తుతం మూడో స్థానంలోనూ లేని పరిస్థితి నుంచి రెండో స్థానాన్ని ఆక్రమిస్తే తప్ప మొదటి స్థానాన్ని కైవసం చేసుకోలేమనేది బీజేపీ నేతల సూత్రం. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్న వాస్తవం కూడా ఇదేనా? బీజేపీ కోరుకున్నదీ, ఎగ్జిట్ ఫోల్ ఫలితాల సారాంశం ఒకటేనా? ఇదే ఉత్సాహంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు కాషాయ పార్టీ కాలు దువ్వుతున్నట్లేగా ! ఈ విషయాన్ని అధికార పార్టీ గుర్తించాల్సి అవసరముందనేది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.