ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ కేంద్రంగా పలువురు నాయకులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు ఊరూ, వాడా తిరుగుతూ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నా అధికార కాంగ్రెస్ అభ్యర్థిత్వం మాత్రం ఎంతకీ తేలడం లేదు. టికెట్ కేటాయింపుపై ముడులు మాత్రమే కాదు పీటముడులు సైతం పడుతున్నాయట. ఈ ముడులను విప్పలేక పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట. ఈ అంశంలో ఢిల్లీ పెద్దల మదిలో ఏముందనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఎలా ఉందంటే..?
డిప్యూటీ సీఎం భట్టి భార్య మల్లు నందినికి టికెట్ ఇస్తే..?
మంత్రులు తుమ్మల, పొంగులేటి సహకరించకుంటే..?
మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డికి ఇస్తే..?
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల ఆగ్రహిస్తే..?
పోనీ మంత్రి తుమ్మల తనయకుడు యుగంధర్ కు ఇస్తే..?
ఇంకేమైనా ఉందా? అటు భట్టి, ఇటు పొంగులేటి అస్సలు సహకరించకపోవచ్చు..
ఎహె.. అసలు మంత్రుల కుటుంబాలకు చెందినవారెవరికీ టికెట్ ఇవ్వకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ప్రచారం చేయిస్తే..?
ఇదేదో బాగానే ఉన్నట్టుంది.. కానీ ప్రత్యామ్నాయం ఏమిటి?
ఎందుకు లేదూ? ఆయనెవరో మీడియా అధిపతి లైన్లో ఉన్నట్టున్నాడు కదా? ఆయనకు ఇస్తే పోలా..?
ఆయనకు ఇస్తే డిప్యూటీ సీఎం భట్టికి ఇచ్చినట్టేనట.. ఆ మీడియా అధిపతి భట్టికి క్లోజ్ ఫ్రెండ్ అని ప్రచారం ఉంది కదా? అటు పొంగులేటికి, ఇటు తుమ్మలకు కోపం రాదా?
కాదుగానీ, వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డికి ఇస్తే…?
ఆయన పొంగులేటికి స్వయానా వియ్యంకుడే కదా? ఈమాత్రం దానికి పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డికే ఇస్తే పోలా?
వీళ్లెవరూ కాదుగాని నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావుకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది.. అస్సలు వివాదం లేకుండా ఉంటుంది కదా?
మండవ వెంకటేశ్వర్ రావు మంత్రి తుమ్మలకు జాన్ జిగ్రీ దోస్త్.. మండవకు ఇస్తే తుమ్మలకు ఇచ్చినట్టే లెక్క. అసలే ఈ విషయంలో తమ నాయకుడు రాజకీయ చాణక్యం ప్రదర్శించినట్లు తుమ్మల అనుచరులు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు..
ఇంతకీ టికెట్ దక్కేదెవరికి..?
రాయల నాగేశ్వర్ రావు పేరు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి కదా?
ఓహో చుట్టూ తిరిగి మళ్లీ భట్టి విక్రమార్క అనుచరున్నే తెరపైకి తీసుకువచ్చారన్నమాట..
ఇంతకీ అతనికైనా టికెట్ దక్కుతుందా?
తనకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని మళ్లీ వి. హనుమంతరావు పిక్చర్ లోకి వచ్చారు గదా?
వామ్మో ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఇన్ని మలుపులా? నాకు పిచ్చెక్కుతోందిర బాబూ..!
వార్తలు వింటున్న నీకే పిచ్చెక్కితే టికెట్ కోసం హోరా హోరీ పోరాడే వారి పరిస్థితి ఏమిటో..?
ఇంతకీ ఎప్పుడు తెములుతుంది టికెట్ యవ్వారం? రేపో, మాపో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేట్టుందిగా?
టికెట్ దక్కించుకున్నవారికి ఖర్చు తగ్గుతుందిలే..? నియోజకవర్గం మొత్తం తిరిగకుండానే దశ తిరిగితే ఎంపీ అయిపోవచ్చు.. కాంగ్రెస్ లో అట్లుంటది మరి..!