హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం రాజీనామా చేశారు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి నేటి వరకు జరిగిన అనేకానేక రాజకీయ పరిణామాల మధ్య ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవిని త్యజించక తప్పలేదు. భూకబ్జా ఆరోపణలు, ఈటెల నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వశాఖను కేసీఆర్ తన చేతుల్లోకి తీసుకోవడం, ఆ తర్వాత మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం తదితర పరిణామాలు తెలిసిందే. ఆయా పరిణామాల్లో ఈటెల రాజకీయ పయనం, భవిష్యత్ కార్యచరణపై భిన్న ప్రచారం, కథనాలు సాగాయి. అయితే చివరికి ఈటెల బీజేపీలో చేరేందుకు సంసిద్ధమయ్యారు.
ఇందులో భాగంగానే ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు శామీర్ పేటలోని తన నివాసం నుంచి అభిమానులతో బయలుదేరిన ఈటెల గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘ఆపరేషన్ ఈటెల’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈటెల వెంట పార్టీ నాయకులుగాని, కార్యకర్తలుగాని ఎవరూ లేకుండా, వెళ్లకుండా అనేక చర్యలు చేపడుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానం తమకు అప్పగించిన పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తంగా ఈటెల రాజేందర్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయ పరిశీలకుల దృష్టి హుజూరాబాద్ పై కేంద్రీకృతమైంది.
కాగా తనను రాజీనామా చేయాల్సిందిగా ప్రజలే ఆశీర్వదించినట్లు ఈటెల ఈ సందర్భంగా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తనకు బీ ఫారం ఇచ్చి ఉండొచ్చుగాక… కానీ తనను గెలిపించిందని ప్రజలేనని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో కౌరవులకు, పాండవులకు యుద్దం జరగబోతోందని, ఈ యుద్ధంలో ప్రజలే గెలుస్తారని చెప్పారు. ఈటెల ఏకవాక్య రాజీనామా లేఖను దిగువన చూడవచ్చు.