ఈటెల రాజేందర్ నిర్వహించిన మంత్రిత్వశాఖల్లోని కార్యకలాపాలపై ప్రభుత్వం మరిన్ని తవ్వకాలు జరపనున్నదా? భూకబ్జా ఆరోపణలు, విచారణలు, నివేదికలు వంటి అంశాల నేపథ్యంలోనే ఆయన మంత్రిత్వ శాఖను బదిలీ చేసుకున్న సీఎం కేసీఆర్ ఈటెల వ్యవహార తీరుపై మరింత లోతైన తవ్వకాల కోసం ఆదేశాలు జారీ చేశారా? అనే ప్రశ్నలపై జోరుగా చర్చ సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామ శివార్లలో 1994 లో తమకు కేటాయించిన అసైన్ లాండ్స్ ను తమ వద్దనుంచి బలవంతంగా ఆక్రమించారని, ఈటల రాజేందర్ కు చెందిన జమునా హాచరీస్ పై వచ్చిన ఫిర్యాదుల మీద మెదక్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి చేరింది. దర్యాప్తు నివేదిక ప్రకారం…. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో, విజిలెన్స్ శాఖ ఎంక్వయిరీలో ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు ఇచ్చిన సుమారు 66.01 ఎకరాల అసైన్మెంట్ భూములను జమున హాచరీస్ సంస్థ కబ్జాచేశారని తేలింది. అదేవిధంగా అసెన్డ్ లాండ్ మీదుగా రోడ్డు వేశారని, ఈ సందర్భంగా ఫారెస్టు కన్సర్వేషన్ యాక్టు, వాల్టా చట్టానికి విరుద్దంగా చెట్లను నరికేశారని మెదక్ జిల్లా ఫారెస్టు అధికారులు విచారణలో తేల్చారు. వ్యవసాయభూమిలో నాలా చట్టానికి విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారని నివేదికలో పేర్కొన్నారు.
ఆయా విచారణలు, నివేదికల తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలపై పలురకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే దశలో గతంలో నిర్వహించిన మంత్రిత్వ శాఖల్లో జరిగిన పలు కార్యకలాపాలపైనా తవ్వకాలు జరగవచ్చంటున్నారు. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖను ఈటెల నిర్వహించిన సందర్భంగా జరిగనట్లు పేర్కొన్న కొన్ని కార్యకలాపాలపై అధికార పార్టీ పత్రిక నిన్ననే ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇదే దశలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖలో కరోనా కిట్లు తదితర సామాగ్రి కొనుగోళ్లు, స్టాఫ్ నర్సు నియామకాల వంటి అంశాల్లోనూ ప్రభుత్వపరంగా తవ్వకాలు జరిగే అవకాశలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. జమునా హేచరీస్ కు చెందిన భూముల వ్యవహారంలోనేకాదు ఈటెల నిర్వహించిన మంత్రిత్వ శాఖల్లోని పలు నిర్ణయాలను లోతుగా పరిశీలించి, తవ్వి మరిన్ని బాగోతాలు వెలికి తీసేందుకు సర్కార్ పెద్దలు ఉద్యుక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అన్ని కోణాల్లో ఈటెలను ఫిక్స్ చేసేందుకు రంగం సిద్ధమవుతోందనేది తాజా సమాచారం.