రాజకీయ ఎత్తుగడల్లో సీఎం కేసీఆర్ ముందస్తు యోచన చేస్తుంటారనే ప్రచారం ఉండనే ఉంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ విషయంలోనూ కేసీఆర్ రాజకీయంగా సేఫ్ గేమ్ ఆడారా? ఇదీ రాజకీయ పరిశీలకుల సందేహం. తెలంగాణాలో నెలరోజులుగా రాజకీయ కలకలపు దృశ్యాలు. మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాడంటూ అనూహ్యంగా మీడియాలో సంచలన కథనాలు. అధికార పార్టీ అనుకూల మీడియా సంస్థలుగా ప్రాచుర్యం పొందిన న్యూస్ ఛానళ్లలో అదేపనిగా వరుస కథనాలు. వెనువెంటనే ఈటెల నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సీఎం చేతుల్లోకి తీసుకోవడం. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మంత్రివర్గం నుంచి ఈటెల బర్తరఫ్ కావడం, మాజీ మంత్రిగా మారడం, ఆయనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై వేగవంతమైన విచారణ కమిటీలు, దర్యాప్తులు, నివేదికలు… ఇలా వరుస పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
పార్టీలో తాము కిరాయిదారులం కాదని, గులాబీ జెండా ఓనర్లమని ఏడాది క్రితం నినదించిన ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నారు? ఆయా పరిణామాల్లో తలెత్తిన అతిముఖ్యమైన ప్రశ్న. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని పలువురు భావించారు. మీడియా సంస్థలు కూడా ఇదే సారాంశంతో వార్తా కథనాలు అందించాయి. ఈటెల కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, కాదు… కాదు బీజేపీలో చేరుతున్నారని భిన్న కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇదే దశలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నాయకులు ఈటెలతో భేటీ అయ్యారు. కానీ చివరికి మాజీ మంత్రి రాజేందర్ బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలను కలిసి సమాలోచనలు చేశారు. తనకు గల సందేహాలను అడిగి తెలుసుకున్నారు. తన డౌట్లు తీరాయో లేదోగాని ఎట్టకేలకు తన 19 ఏళ్ల అనుబంధానికి, టీఆర్ఎస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం అసెంబ్లీ స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీలో చేరనున్నట్లు కూడా ఈటెల క్లారిటీ ఇచ్చారు.
నెల రోజులకు పైగా జరిగిన ఆయా పరిణామాల్లో రాజకీయంగా కేసీఆర్ కోరుకున్నదే జరిగిందా? తన అంచనాకు అనుగుణంగానే ఈటెల బీజేపీలో చేరుతున్నారా? కేసులు, దర్యాప్తుల ద్వారా వెంటపడి, భయపెట్టింది కూడా ఈటెల బీజేపీలో చేరాలనే ఉద్దేశంతోనేనా? ఇవీ పొలిటికల్ వర్గాల్లో తాజా సందేహాలు. బీజేపీలో చేరితే కేసుల భయం నుంచి రక్షణ ఉంటుందనే ధీమా ఈటెలలో ఏర్పడినట్లేనా? ఎంతమంది చెప్పినా రాజేందర్ భయపడ్డారా? కేసీఆర్ కు కావలసింది కూడా సరిగ్గా అదేనా? ఈటెల బీజేపీలో చేరితే ఇక ఇంతే సంగతులా? అక్కడ పదిమంది ప్లేయర్లతోపాటు 11వ ప్లేయరుగా ఈటెల మారనున్నారా? అంతకు మించి కొత్తగా జరిగేదేమీ ఉండదా? ఇక ఈటెల బీసీ వాదం వీడినట్లేనా? వ్యక్తిగతంగా నాయకుడిగా ఆయన బీజేపీలో ఎదిగేదేమీ ఉండదా? మోడీ ప్రతిష్ట రోజురోజుకూ తగ్గిపోతున్నదా? ప్రతికూల పవనాలు వీస్తున్నాయా? ఇపుడు కాషాయ పార్టీలోకి ఈటెల వెళ్లినా వేస్టేనా? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చకు సంబంధించిన ప్రశ్నలివి.
ఇందుకు విరుద్ధంగా ఈటెల కొత్త పార్టీ పెడితే తమకు డేంజర్ గా టీఆర్ఎస్ అధిష్టానం భావించిందా? పాత తెలంగాణ ఉద్యమకారులంతా ఒక్కటవుతారని అంచనా వేసిందా? కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒక ఫ్రంట్ గా మారుతాయని ఊహించారా? కేసీఆర్ పంపించిన లేదా పార్టీని వీడినోళ్లంతా జమ అవుతారని భావించారా? రోజుకో గోల, తమకు అన్యాయం జరిగిందని చెప్పి రకరకాల వాదనలతో నిత్యం పరువు తీస్తారని కూడా అంచనా వేశారా? ఇటువంటి పరిణామాల్లో వీళ్లకు ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి కూడా లభిస్తుందని, సహజంగానే ప్రజల మద్దతు పొందే అవకాశముందని లెక్కలు కట్టారా? ఇపుడు ఈటల బీజేపీలో చేరడం చేరితే… కొత్తపార్టీ, ఫ్రంట్ సమస్యే ఉండదనుకున్నారా? ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ సేఫ్ గేమ్ ఆడుకోవచ్చా? మొత్తంగా తన ఎత్తుగడల ద్వారా పిడికిలి బిగించిన ‘కామ్రేడ్’ ఈటెల రాజేందర్ అనివార్యంగా బీజేపీ వైపు మొగ్గు చూపేవిధంగా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఫలించినట్లేనా? ఆయా ప్రశ్నలపై పొలిటికల్ సర్కిళ్లలో భిన్న వాదన, చర్చ జరుగుతోంది.