మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రెండు రోజుల క్రితం ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? రాజేందర్ ఢిల్లీ పర్యటన వెనుక గల అసలు ఎజెండా ఏమిటి? ఇవీ హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయ పరిశీలకుల్లో రేకెత్తుతున్న తాజా ప్రశ్నలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తెలంగాణా బీజేపీ నేతలు రెండు రోజుల క్రితం ఢిల్లీలో కలుసుకున్న సంగతి తెలిసిందే. అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణా బీజేపీ నాయకుల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని ఆయన నిర్దేశించారని చెప్పారు. ఇందుకోసం ఎన్నిసార్లయినా తెలంగాణకు వస్తానని చెప్పారని ప్రకటించారు. ప్రత్యర్థులు ఎంత డబ్బు ఖర్చు చేసినా హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీయేనని ఈటెల ధీమాను వ్యక్తం చేశారు.
అయితే ఈటెల సహా తెలంగాణా బీజేపీ నేతలు అమిత్ షాతో భేటీ కావడం వెనుక అసలు ఎజెండా వేరే ఉందని ఆ పార్టీ శ్రేణుల్లోనే ప్రచారం జరుగుతోంది. వీలైతే ఆగస్టు, లేదంటే సెప్టెంబర్ నెలలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని తెలంగాణా బీజేపీ నేతలు అమిత్ షాకు నివేదించినట్లు సమాచారం. ప్రస్తుత వాతావరణం, పరిస్థితులు ఈటెలకు అనుకూలంగా ఉన్నాయని, ఉప ఎన్నికలు షెడ్యూల్ ఆలస్యమైనకొద్దీ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశముందని వివరించినట్లు తెలిసింది.
తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రోజురోజుకూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని, అస్త్ర, శస్త్రాలను ఉపయోగిస్తూ పరిస్థితులను వారికి అనుకూలంగా మల్చుకునేందుకు రకరకాల ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని కూలంకషంగా నివేదిస్తూ, ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరగా వెలువడేలా చూడాలని అమిత్ షాను అభ్యర్థించినట్లు బీజేపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. అయితే హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఎంతగా ఆలస్యమైతే తమకు అంత శ్రేయస్కరంగా టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో కరోనా తీవ్రత పెరుగుతోందని వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ముఖ్య అధికారి ఒకరు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఆలస్యం కావడం అన్ని విధాలా తమకు మేలుగా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారట. ఈ వ్యవధిలో ఈటెల రాజేందర్ గ్రాఫ్ ను రోజు రోజుకూ తగ్గించేందుకు అవకాశం చిక్కుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరగా జరగాలని ఈటెల రాజేందర్, ఆలస్యంగా జరగాలని అధికార పార్టీ నేతలు అభిలషిస్తున్నట్లు తాజా వార్తాల సారాంశం.