మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పిడికిలి బిగించారు. సోషల్ మీడియాలోని తన అధికారిక ఖాతాల్లో పిడికిలి బిగించిన చిత్రంతో ‘ప్రొఫైల్ పిక్చర్’ను మార్చిన ఘటన రాజకీయంగా చర్చకు దారి తీసింది. మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ ప్రొఫైల్ పిక్చర్ మారడం విశేషం.
ప్రశ్నిస్తున్నట్లు గల తన ఫొటోతోపాటు తెలంగాణా తల్లి, తెలంగాణా అమరవీరుల స్మారక చిహ్నం, ఫూలే, అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలతో ప్రొఫైల్ పిక్చర్ ను రూపొందించారు. అంతేగాక తెలంగాణా మ్యాప్ లో పిడికిలి బిగించిన చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రగతిశీల, ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) పోరాట చిత్రాన్ని అచ్చుగుద్దినట్లు పిడికిలి బిగించిన చిహ్నాన్ని ఇందులో ఏర్పాటు చేయడం గమనార్హం.
పూర్వకాలంలో ఈటెల రాజేందర్, జమున దంపతులు PDSUలో పనిచేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని ఓ కళాశాలలో రాజేందర్ PDSU నాయకునిగా వ్యవహరించారు. ఆయా విద్యార్థి సంఘానికి చెందిన పిడికిలి బిగించిన చిత్రాన్నే రాజేందర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్ గా వాడడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.