లోక్ సభలో టీఆర్ఎస్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. జార్ఖండ్ లోని రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు లోన్ల మొత్తపు నిధులను దారి మళ్లించారనే అభియోగంపై ఈడీ గత శుక్రవారం తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాదద్ లోని ఎంపీ నామ నాగేశ్వర్ రావు నివాసంలోనేగాక ఆయన ఫౌండర్ గా ఉన్నటువంటి మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన కొన్ని ఆఫీసుల్లో సోదాలు చేశారు. ఈ ఉదంతంలో నిధుల మళ్లింపునకు సంబంధించి 2019లోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2020లో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఇందుకు సంబంధించి రాంచీ ఎక్స్ప్రెస్వే సంస్థకు అప్పట్లో డైరెక్టర్లుగా ఉన్నటువంటి కె. శ్రీనివాసరావు, నామ సీతయ్య, ఎన్. పృథ్వితేజ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథనాలు వస్తున్నాయి.
అయితే తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్న నామ నాగేశ్వర్ రావు పేరుకు ఈ విషయంలో బహుళ ప్రాచుర్యం కల్పిస్తున్న తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయని నామ నాగేశ్వర్ రావు వర్గీయులు అంటున్నారు. అందిన సమచారం ప్రకారం… వాస్తవానికి మధుకార్ గ్రూప్ ఆప్ కంపెనీలకు చెందిన ఏ సంస్థకు కూడా పుష్కర కాలంగా నామ నాగేశ్వర్ రావు చైర్మెన్ గా గాని, డైరెక్టర్ హోదాలో గాని లేరు. ఆయా కంపెనీలకు చెందిన పోస్టుల్లో ఏ హోాదాలోనూ నామ నాగేశ్వర్ రావు ప్రస్తుతం లేరు. తెలుగుదేశం పార్టీ తరపున 2009లో ఎంపీగా గెలిచిన అనంతర ఆయన ఆ పార్టీ తరపున లోక్ సభాపక్ష నేతగా వ్యవహరించారు. ఇదే సందర్భంగా ఎంపీగా ఎన్నికైందే తడవుగా నామ నాగేశ్వర్ రావు మధుకాన్ గ్రూపు సంస్థల్లో గల అన్ని హోదాల నుంచి తప్పుకున్నారని ఆయా వ్యవస్థలోని ఉద్యోగ వర్గాలు ఖరాఖండిగా చెబుతున్నాయి.
గత పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికైన నామ నాగేశ్వర్ రావు అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ తరపున లోక్ సభా పక్ష నేతగా ఎంపికయ్యారు. గడచిన రెండేళ్లుగా తనదైన శైలిలో నామ నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా రాణిస్తున్నారు. అయితే మధుకాన్ సంస్థల్లో ప్రస్తుతం ఏ హోదాలో లేకపోయినా నామ నాగేశ్వర్ రావు లక్ష్యంగా ఈడీ దాడులంటూ ప్రచారం జరగడంపై గులాబీ పార్టీ వర్గాలే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి గత శుక్రవారం కేవలం హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే ఈడీ సోదాలు జరగ్గా, ఖమ్మంలోని నామ నాగేశ్వర్ రావు నివాసంలో, ఆఫీసుల్లోనూ ఈడీ దాడులు జరుగుతున్నాయని మీడియాలో ప్రచారం జరగడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక నిన్నటి వరకు కూడా ఈడీ దాడుల వ్యవహారంలో నామ నాగేశ్వర్ రావు పేరు ప్రత్యక్షంగా లేదని, బుధవారం మాత్రం ఆయనకు సమన్లు జారీ కావడంపైనా టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రాంచీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణపు వ్యవహారం, సీబీఐ కేసు, ఈడీ దర్యాప్తు వంటి అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, రాజకీయంగా నామ నాగేశ్వర్ రావు ‘టార్గెట్’ అయ్యారా? అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. మధుకాన్ గ్రూపు సంస్థల్లో గడచిన పన్నెండేళ్లుగా ఏ పదవిలోనూ లేని నామ నాగేశ్వర్ రావు లక్ష్యంగా సాగుతున్న ప్రచారపు తీరుతెన్నులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ జారీ చేసిన సమన్ల నేపథ్యంలో ఈనెల 25న నామ నాగేశ్వర్ రావు విచారణకు హాజరయ్యే సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఆయా పరిణామాలు ఆయన ఫ్లోర్ లీడర్ పదవిపై ప్రభావాన్ని చూపుతాయా? అనే సంశయాలను ఆయన అనుయాయులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ అంశంలో ఏదేని ‘రాజకీయం’ జరుగుతోందా? అదే నిజమైతే తెరవెనుక సూత్రధారులెవరు? అనే సందేహాలను కూడా నామా అనుచరగణం వ్యక్తం చేస్తోంది.