ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా చింతగుప్ప-డల్లెడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య గురువారం భారీ ఎన్కౌంటర్ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర పోరులో దాదాపు ఐదుగురు మావోయిస్టు నక్సల్స్ మరణించి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఘటనా స్థలం నుంచి ప్రస్తుతానికి ఓ మహిళా నక్సల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
నక్సలైట్ల కోసం గాలింపు చర్యల్లో భాగంగా చింతగుప్ప అటవీ ప్రాంతంలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. సీఆర్పీఎఫ్ డీఐజీ యోజనన్ సింగ్, సుక్మా ఎస్పీ కన్హయ్య లాల్ ధ్రువ్ బుర్కపాల్ క్యాంపులో మకాం వేసి ఎన్కౌంటర్ ఘటనను పర్యవేక్షిస్తున్నారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా విభాగాలకు చెందిన పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన సందర్భంగా ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిసింది.
ఇరువర్గాల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో కనీసం ఐదుగురు నక్సల్స్ మరణించి ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి రైఫిల్ సహా నక్సల్స్ కు చెందిన ఇతర సామాగ్రిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్ల శిబిరంపైన పోలీసులు విరుచుకుపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.