తెలంగాణా నక్సలైట్లకు, ఛత్తీస్ గఢ్ పోలీసులకు మధ్య కొద్దిసేపటికి భారీ ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఓ నక్సల్ మృతి చెందగా, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన జవాన్లను హెలీకాప్టర్ ద్వారా చికిత్స కోసం తరలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంత సరిహద్దుల్లో గల ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు గంటసేపు ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగింది.
భట్టిగూడలోని ముక్రాజ్ గుట్టల్లో నక్సలైట్లు, పోలీసులు పరస్పరం ఎదురుపడిన సందర్భంగా కాల్పుల ఘటన జరిగింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, తెలంగాణా ప్రాంతానికి చెందిన నక్సలైట్లు తారసపడిన సమయంలో ఎన్కౌంటర్ జరిగిందని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ చెప్పారు.
ఘటనా స్థలం నుంచి దాదాపు 50 పైప్ బాంబులు, నాలుగు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎదురుకాల్పుల్లో మరణించిన నక్సల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.