పొరుగున గల ఛత్తీస్ గఢ్ లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య శుక్రవారం భారీ ఎన్కౌంటర్ ఘటన జరిగింది. ఫలితంగా పది మంది మావోయిస్టులు మరణించారు. సుక్మా జిల్లా కుంట అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పోలీసు వర్గాల కథనం ప్రకారం..
ఒడిషా నుంచి సరిహద్దుల ద్వారా ఛత్తీస్ గఢ్ లోకి నక్సలైట్లు ప్రవేశిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో డీఆర్ జీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సుక్మా జిల్లాలోని కుంట ప్రాంత అడవుల్లో నక్సలైట్ల కదలికలను పోలీసులు పసిగట్టారు. పోలీసుల బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా, అప్రమత్తమైన డీఆర్ జీ పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఇరువర్గాల మధ్య జరిగిన భీకరపోరులో పది మంది నక్సలైట్లు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో ఏకే-47 సహా పలు అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన నక్సలైట్లలో పార్టీ అగ్రనేతలు ఉండి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఎన్కౌంటర్ ఘటనను సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు.