భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య చర్ల అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన తీవ్రవాది ఒకరు మరణించినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం… అమర వీరుల వారోత్సాల సందర్భంగా మావోయిస్టు పార్టీకి చెందిన ఎల్వోఎస్, యాక్షన్ బెటాలియన్ కు చెందిన నక్సలైట్లు చర్ల మండలంలోని కుర్నపల్లి, బోదెనెల్ల ప్రాంతాల్లో సంచరిస్తూ ఏదేని ఘటనకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాల్లో స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆదివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పది మంది నక్సలైట్లు బోదెనెల్ల ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఉదయం 8.15 గంటల ప్రాంతలో ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 23 ఏళ్ల వయస్సు గల ఓ పురుష నక్సలైట్ మరణించినట్లు గుర్తించారు. మృతుని వద్ద నుంచి 303 తుపాకీ, రెండు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని, గాలింపు కొనసాగుతోందని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం తన ప్రకటనలో వివరించింది.