తెలంగాణాలో తుపాకుల మోత మోగింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకరపోరు జరిగింది. ఫలితంగా దళనేత సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో నక్సలైట్ల కోసం జల్లెడ పట్టిన పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. గడచిన 40 రోజులుగా తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో సంచరిస్తున్న లచ్చన దళాన్ని గురువారం ఉదయం పోలీసులు తుదముట్టించారు. తెలంగాణాలో పూర్వ పట్టుకోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టు పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు. ఇంతకీ లచ్చన్న దళం పోలీసులకు ఎలా చిక్కింది? పోలీసులు అమలు చేసిన ప్రణాళిక ఏమిటి? వంటి అనేక ప్రశ్నలపై భిన్నకోణాల్లో సమాచారం అందుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గోదావరి నది దాటి ఛత్తీస్ గఢ్ దండకారణ్యం నుంచి తెలంగాణా అడవుల్లోకి ప్రవేశించిన లచ్చన్న దళం ఆచూకీపై పోలీసులు దాదాపు నలభై రోజులుగా జల్లెడ పడుతూనే ఉన్నారు. జూలై నెలలో తెలంగాణాలో ప్రవేశించినట్లు తెలుస్తున్న లచ్చన్న దళం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సంచరిస్తోంది. వర్షాలు, వరదలు చుట్టుముట్టక ముందు గోదావరి నది దాటిన లచ్చన్న దళం తిరిగి ఛత్తీస్ గఢ్ లోకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదంటున్నారు. వర్షాలు మొదలై, వరదల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రశహించడం, గోదావరి వరద ఉధ్రుతి నక్సలైట్లు తిరిగి ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లకుండా నిరోధించాయంటున్నారు. దీంతో అటు ములుగు జిల్లా ఏటూరునాగారం, మేడారం, తాడ్వాయి, మంగపేట, ఇటు భద్రాద్రి జిల్లా గుండాల, కరకగూడెం తదితర ప్రాంతాల్లోని అడవుల్లో సంచరిడం నక్సల్స్ కు అనివార్యమైందంటున్నారు.
ఈ నేపథ్యంలోనే గత జూలై నెలాఖరులో పోలీసులకు, మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ ఘటన చోటుచేసుకుంది. దామెరతోగు, కౌశెట్టివాయి అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ఓ దళసభ్యుడు మరణించాడు. దీంతో ఇక్కడ లచ్చన్న దళం సంచరిస్తున్నట్లు పోలీసులకు ధ్రువపడింది. ఈ ఎన్కౌంటర్ తర్వాత లచ్చన్న దళంపై పోలీసులు గట్టి పట్టు బిగించినట్లు తెలుస్తోంది. ఘటనానంతరం లచ్చన దళం కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడంలో తెలంగాణా పోలీసులు సఫలమయ్యారు. ఈ పరిణామాల్లోనే గడచిన 40 రోజులుగా లచ్చన్న దళాన్ని అడుగడుగునా వెంటాడుతున్న పోలీసులకు రఘునాథపాలెం అడవుల్లో పరిస్థితులు అనుకూలించినట్లు సమాచారం. గోదావరి నది దాటి భారీ వర్షాల కారణంగా మళ్లీ నది దాటలేక ములుగు, భద్రాద్రి జిల్లాల అడవుల్లోనే తిరుగుతున్న లచ్చన్న దళాన్ని పకడ్బందీగా మట్టుబెట్టడంలో పోలీసులు విజయం సాధించారు.
ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన నక్సలైట్ల వివరాలు కూడా అందాయి. మృతులను కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, తులసి, శుక్రుడు, వెల్లదాం, దుర్గేష్, కట్ గా పోలీసు వర్గాలు తెలిపాయి.
ఫొటో: ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో లభ్యమైన తుపాకులు, ఆయుధ సామాగ్రి