తెలంగాణాలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొద్దిసేపటి క్రితం జరిగిన ఎదురుకాల్పలు ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ కథనం ప్రకారం… ఈరోజు రాత్రి 7:00 గంటల సమయంలో చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలోని గుట్టల వద్ద జిల్లా పోలీస్ పార్టీలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా ప్రదేశాన్ని పోలీసులు తనిఖీ చేయగా, ఒక మగ, ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభించాయి.
ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశం నుండి ఒక 8mm రైఫిల్, బ్లాస్టింగ్ కు ఉపయోగించే సామాగ్రి, ఒక కిట్ బ్యాగు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారని, అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సీ సునీల్ దత్ వివరించారు.