చరిత్రాత్మక ‘సాక్షి’ మీడియా గ్రూపులో రాజీనామాల పర్వం కలకలం కలిగిస్తోంది. చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీకి గురైన వారిలో అనేక మంది స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకునే పరిస్థితులు, పరిణామలు అనివార్యమయ్యాయని అంటున్నారు. కారణాలు ఏవైనప్పటికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలో తాజా పరిణామాలు ఆ సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. మొన్నటి వరకు స్టాఫ్ రిపోర్టర్ల, బ్యూరో ఇంచార్జిల మెడపై వేలాడిన బదిలీలు, రాజీనామాల పర్వపు కత్తి తాజాగా స్టాఫ్ ఫొటోగ్రాఫర్ల మీదకు మళ్లడం గమనార్హం.
దాదాపు పదిహేను రోజుల క్రితం సాక్షి పత్రికలో పలువురు జర్నలిస్టులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణాలో పనిచేస్తున్న అనేక మంది స్టాఫ్ రిపోర్టర్లను, బ్యూరో ఇంచార్జిలను, సబ్ ఎడిటర్లను ఢిల్లీ, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్ వంటి ప్రాంతాలకు బదిలీ చేశారు. ఆయా కేంద్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు సుముఖంగాలేని కొందరు ఇప్పటికే రాజీనామా చేశారు. ఇంకొందరు ‘చివరి’ ప్రయత్నంగా తమ పలుకుబడితో ‘లాబీయింగ్’ చేస్తూ బదిలీని నిలుపుదల చేసుకోవడమో, కనీసం తెలంగాణా ప్రాంతంలో పనిచేసే విధంగా మార్పు చేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో సాక్షి ఎంచుకున్న పాలసీ ప్రకారం ఇటువంటి వారి ప్రయత్నాలేవీ ఫలించడం లేదంటున్నారు.
ఆయా పరిణామాల నుంచి సాక్షి రిపోర్టర్లు తేరుకోకముందే తాజాగా అనేక మంది ఫొటోగ్రాఫర్ల చేత సంస్థ యాజమాన్యం రాజీనామాలు స్వీకరిస్తున్న తీరు ఉద్యోగవర్గాల్లో ఆందోళనకు కారణమైంది. తెలంగాణాలోని మెదక్, వనపర్తి, కొత్తగూడెం, ఆంధప్రదేశ్ లోని మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నులు కేంద్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ ఫొటోగ్రాపర్లను హైదరాబాద్ కు పిలిపించుకుని రాజీనామాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు సాక్షి మీడియా గ్రూపులో ఏం జరుగుతోంది? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెరిగిన విపరీత ఖర్చులను తగ్గించుకునే అంశంలో గతంలో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ సంస్థ రూపొందించిన నివేదికను యాజమాన్యం అటకెక్కించినట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా విసిరేసినట్లు జరుగుతున్న బదిలీలు, రాజీనామాల పర్వం వంటి ఉదంతాలు పలు అనునామాలకు తావు కల్పిస్తున్నాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. అటకెక్కించిన సాఫ్ట్ వేర్ కంపెనీ నివేదికకు బూజు దులిపిన పర్యావసనమే తాజా ఘటనలకు అసలు కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా సాక్షి మీడియా గ్రూపులో బదిలీలు, రాజీనామాల ఉదంతాలు జర్నలిస్టు సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.