అది ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి. హాస్పిటల్ అన్నాక దానికో సూపరింటెండెంట్ కూడా ఉంటారు కదా? ఆయన పేరే డాక్టర్ ఏవీఆర్ మోహన్. నూతన సంవత్సరం సందర్భంగా తమ సూపరింటెండెంట్ ను సన్మానించి, సత్కరించి తరించాలని ఆసుపత్రి సిబ్బంది సరదా పడ్డారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి సన్మానాలకు సాధారణంగా ఏ ఫంక్షన్ హాలో, ప్రయివేట్ ప్లేసో చూసుకుంటారు. కానీ ‘మా ఆసుపత్రి, మా ఇష్టం’ అనుకున్నారో ఏమోగాని ఆసుపత్రినే సత్కారానికి వేదికగా చేసుకున్నారు. వైద్యాధికారులు తమ మెడలోని స్టెత స్కోప్ లను పక్కన పడేసి మాంచి డీజే సౌండ్ ఏర్పాటు చేసుకుని చిందేశారు. ఆసుపత్రిలోని నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు, సిబ్బంది, కార్మికులు తర, తమ భేదం లేకుండా కలిసిపోయి వారితోపాటే డాన్స్ చేశారు.
ఆసుపత్రిలోని పేషెంట్లను గాలికొదిలేసి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒకటే డీజే సౌండ్ రొద… హుషారెత్తే డాన్స్ లతో అదరహో అనిపించారు. ‘గున్నా గున్నా మామిడి… జిలేలమ్మా జిట్టా… పిలా పాలా పిట్టా… డీజే గొట్టు డీజే..’ అంటూ మాంచి హుషారైన పాటలతో సారువారి సన్మాన వేడుకలను అత్యంత పసందుగా మార్చారు. అంతా బాగానే ఉందని డాన్సేసిన వారు భావించారు.
కానీ డాన్స్ చేసిన ప్రదేశం, అక్కడి భౌతిక పరిస్థితులపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. వందలాది మంది పేషెంట్లు వైద్యం కోసం వేచి చూస్తున్నా పట్టించుకున్నవారే కరువయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ సైతం ఇటువంటి డీజే చిందులను నిలువరించకుండా చోద్యం చూశారని, విధులకు ఎగనామం పెట్టి డాన్సుల కార్యక్రమం ఏంటని రోగులు మండిపడ్డారు. అంతేకాదు సూపరింటెండెంట్ సారువారి ‘సత్కార’ చిందుల తీరుపై వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాస్తవానికి ఈ సంఘటన గత నెల 2వ తేదీన జరిగింది. సీన్ కట్ చేస్తే…
దాదాపు 45 రోజుల తర్వాత ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్ రెడ్డి కొరడా అందుకున్నారు. అయిదుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి పది రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. గతంలోనే ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఓ నివేదికను కూడా సమర్పించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ మోహన్ కు రివర్షన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు కూడా వేశారు.
అంతా సమసిపోయిందని భావిస్తున్న సమయంలో కొందరు రెగ్యులర్ ఉద్యోగులకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ కావడమే సంచలనం కలిగిస్తోందట. షోకాజ్ నోటీసులు అందుకున్నవారిలో జిల్లా ఆసుపత్రి గ్రేడ్-1 సూపరింటెండెంట్ వరలక్ష్మిబాయి, గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ జయకుమారి, డీసీహెచ్ఎస్ ఏడీ పిల్లా ఉమాదేవి, హెడ్ నర్స్ శాంతకుమారి, సూర్యవతి, ఫార్మసిస్ట్ రామకృష్ణలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. షోకాజ్ నోటీసులకు ఆయా ఉద్యోగులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండవచ్చని ఏలూరు వైద్య, ఆరోగ్యశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి సారువారి సత్కారం సర్కారు పెద్దల చీత్కారానికి దారి తీసింది. ఈ సంఘటన ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడమే అసలు విశేషం.