కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ మాజీ ఎంపీ పోరీక బలరాం నాయక్ పై కేంద్ర ఎన్నికల సంఘం మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది. దీంతో మూడేళ్లపాటు ఆయన చట్టసభలకు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయినట్లయింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్ నిర్ణీత గడువులోపు ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించలేదు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ ఈసీ గెజిట్ జారీ చేసింది.
ఫలితంగా మూడేళ్లపాటు బలరాం నాయక్ అటు పార్లమెంట్ ఉభయ సభలకుగాని, ఇటు అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లోగాని పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఆదేశాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన మాధవరెడ్డిగారి హన్మంతరెడ్డిలపై కూడా ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఈసీ జారీ చేసిన ఉత్తర్వును దిగువన చూడవచ్చు.