తెలుగు జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేక ఒరవడిని సముపార్జించుకున్న ‘ఈనాడు’ పత్రిక తాజా పరిస్థితుల్లో బెంబేలెత్తుతోందా? ‘THE LARGEST CIRCULATED TELUGU DAILY’ అనే ABC (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్) సర్టిఫికెట్ ను దశాబ్ధాలుగా కైవసం చేసుకుంటున్న ఈనాడు ప్రస్తుతం ఏ వార్త ప్రచురించాలన్నా భీతికి గురవుతున్నదా? తెలుగు పత్రికా రంగంలో తనకు ఎదురే లేదని ఏళ్ల తరబడి నిరూపించుకుంటున్న అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక ప్రస్తుత వార్తా ప్రచురణ తీరుతెన్నులపై జర్నలిస్టు వర్గాలు సందేహిస్తున్న అంశమిదే.
‘దొంగలతో దోస్తీ’ శీర్షికన తెలంగాణా పోలీసులపై ఓ బ్యానర్ స్టోరీని ప్రచురించిన ఈనాడు తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ‘తోక ముడిచిన చందం’గా, సరెండరైన తరహాలో వ్యవహరించిన విషయం తెలిసిందే. పోలీసు యంత్రాంగాన్ని ఉటంకిస్తూ ‘కించపరిచే ఉద్ధేశం లేదు’ శీర్షికన ఎన్నడూ లేని విధంగా ఈనాడు మొదటి పేజీలో భయం, భయంగా వివరణ ఇచ్చుకున్న తీరు ఐదు రోజుల క్రితం తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీతోపాటు పలు కమిషనరేట్లకు చెందిన పోలీస్ కమిషనర్లు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఈనాడు వార్తను ఖండ ఖండాలుగా ఖండిచిన తీరుకు ఆ పత్రిక భయకంపితమైందనే కాసేపు భావిద్దాం. అందుకే అక్షరాక్షరం వణుకుతున్నట్లు వివరణ ఇచ్చిందనే అనుకుందాం.
కానీ ఇతర అంశాల్లోనూ ఈనాడు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లేనా? లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని కలవరపడుతున్నట్లేనా? తాజాగా మరో ముఖ్య వార్తకు సంబంధించి ఈనాడు ప్రచురించిన వార్తా కథనం తీరు సైతం ప్రస్తుతం జర్నలిస్టు సర్కిళ్లలో మరోసారి చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ ప్లీనరీ ఖర్చులు, గులాబీ కూలీ ధర, మైహోం రామేశ్వరరావుకు చెందిన విలువైన భూముల వ్యవహారంలో మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటాలను కాసేపు పక్కనబెడితే, రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలో భూముల వివాదంపై ఈనాడు తన పాఠకులకు అందించిన వార్తా కథనం తీరుతెన్నులు తాజాగా చర్చల్లోకి రావడమే అసలు విశేషం. ‘గోపన్ పల్లిలో భూంఫట్’ శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురించిన ఈనాడు తన లీడ్ వాక్యాల్లోనే మరో భూ అక్రమం బయటపడిందని కూడా నిర్ధారించిన తీరుగా వ్యాఖ్యానించడం గమనార్హం.
విషయాన్ని ఇంతగా స్పష్టీకరించిన ఈనాడు మొత్తం వార్తా కథనంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎంపీ రేవంత్ రెడ్డి పేరునుగాని, ఆయన సోదరుని పేరును గాని రాయకపోవడం, ప్రస్తావించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుడు, ఆయన సోదరుడు అంటూ ఈనాడు తన వార్తా కథనంలో ఉటంకించిన తీరు భిన్నాభిప్రాయాలకు తావు కల్పించింది. తన పాత్రికేయ ప్రస్థానంలో పలువురు రాజకీయ నేతలను, ఉన్నతాధికారులను బెంబేలెత్తించిన ఈనాడు ప్రస్తుతం ఇలా వ్యవహరించడానికి గల కారణాలేమిటన్నదే అంతుబట్టని అంశంగా మారిందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాలను పరిశీలిస్తే ఈ అంశంలో ఇటువంటి సందేహాలు రేకెత్తడం సహజమే. పోలీసు యంత్రాంగం ధాటికి భీతిల్లి మొదటి పేజీలో వివరణ ఇచ్చుకున్నట్లు ప్రచారం జరిగిన ఈనాడు తాజాగా రాజకీయ నేతలకూ భయపడుతున్నట్లేనా? ఎందుకిలా…? ఏమిటీ మర్మం? ఇంతకీ ఈ ‘ఈనాడు’కు ఏమైంది? ఇవీ లక్షలాది మంది ఈనాడు పాఠకుల్లో నెలకొన్న సంశయాలు.