ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం… వంటి ఉపోద్ఘాతాలు, సోది, సొల్లు, స్వోత్కర్షల అంశాల్లోకి వెళ్లకుండా సూటిగా విషయంలోకి వెడదాం. ఓ డౌటు… మున్ముందు జర్నలిస్టులు ‘అడ్డా’ కూలీలుగా మారబోతున్నారా? ఇదీ తాజా ప్రశ్న. ‘ఆయ్… ఇన్నేళ్ల అనుభవం ఉండి, ఇదే వృత్తిలో అక్షర సమరం సాగిస్తూ సహచర జర్నలిస్టులను ‘అడ్డా కూలీలు’గా అభివర్ణిస్తావా? అని కలం సోదరులు ‘గుస్సా’ చేయాల్సిన అవసరమే లేదు. తాజా పరిణామాలు, పరిస్థితులు ఇవే సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఓ న్యూస్ ఛానల్ ప్రారంభించారు. దీనికి అనుబంధంగా ‘పిల్ల’ ఛానల్స్ కూడా అనేకం ఉన్నాయనేది వేరే విషయం. మరి న్యూస్ ఛానల్ ను ప్రారంభంచడానికి ముందు జర్నలిస్టుల నియామకం చేయాలి కదా? అప్పుడే ఈ ఛానల్ యజమాని ఓ సీనియర్ జర్నలిస్టుతో ఓ ఘోర వ్యాఖ్య చేశాడట. అదేమిటంటే…? ‘ అడ్డా కూలీల తరహాలో ఏ రోజుకారోజు పని చేయించుకునేందుకు, అంటే వార్తలు రాయించుకునేందుకు విలేకరులు దొరకరా? ఈ ఉద్యోగ నియమకాల గొడవ లేకుండా పని జరగదా?’ అని ప్రశ్నించాడట. దీంతో ఆ ఛానల్ లో పెద్ద హోదాలో గల జర్నలిస్టులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారట.
‘జర్నలిస్టులంటే కూలీలు కాదు సర్, మీరు ఆశిస్తున్నట్లు దొరకరు, ఆ ప్రాతిపదికన తీసుకోవడమే కుదరదు, ఒకవేళ మనం అందుకు కొత్తగా సాహసించినా ఎవరూ దొరకరు, దొరికినా బాధ్యతాయుతంగా పనిచేయరు. ఇది శారీరక శ్రమ కాదు. మేథస్సుకు సంబంధించిన కష్టం’ అని యజమానికి చెప్పారట. ‘ఎందుకు దొరకరు. చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అడ్డా కూలీల తరహాలో జర్నలిస్టులు పనికి దొరికే పరిణామాలు తప్పక వస్తాయి’ అని సదరు ఛానల్ యజమాని ఎనిమిదేళ్ల క్రితమే తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారట. అదే ఛానల్లో కొంత కాలం పనిచేసి అక్కడి ఈతి బాధలు తట్టుకోలేక ఉద్యోగాన్నే వదిలేసుకున్న హైదరాబాద్ లోని ఓ సీనియర్ జర్నలిస్టు ఇటీవలే చెప్పిన విషయమిది. ఉద్యోగ నియామకం ప్రాతిపదికన కాకుండా ఏరోజుకారోజు అడ్డా కూలీల తరహాలో జర్నలిస్టులతో పని చేయించుకుంటే ఇతర భత్యాలు, గోల ఉండవు కదా? అనేది యజమాని ఆలోచన కావచ్చు.
సదరు ఛానల్ యజమాని ఏ ఉద్ధేశంతో జర్నలిస్టుల గురించి అప్పట్లో ఈ యోచన చేశారోగాని, అతని ‘టంగ్’ ప్రభావం కావచ్చు. కరోనా కల్లోల పరిణామాలు జర్నలిస్టుల బతుకును ఛిద్రం చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆందోళనకర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజా పరిణామాలు అందుకు దారి తీస్తున్నట్లు కూడా గోచరిస్తోంది. ఎందుకంటే…? THE LARGEST CIRCULATED TELUGU DAILY అనే ఏబీసీ సర్టిఫికెట్ గల ‘ఈనాడు’ దినపత్రిక అచ్చం అడ్డా కూలీలను తలపిస్తూ జర్నలిస్టులకే కాదు, అందులో పనిచేసే ఇతర విభాగాల సిబ్బందికి కూడా పని దినాలను కేటాయిస్తోంది. ఈమేరకు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ‘లే ఆఫ్’ పేరుతో సోమవారం రాత్రి పొద్దు పోయాక నోటీసులు జారీ చేసింది. అందుకు సంబంధించిన ప్రతులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారంలో రెండు, మూడు రోజుల పని దినాలను కేటాయిస్తూ తేదీలను కూడా నోటీసుల్లో ‘ఈనాడు’బాధ్యులు నిర్దేశించారు.
మీడియా టైకూన్ రామోజీరావుకు చెందిన అతి పే…ద్ద సంస్థే ఉద్యోగులకు ఇటువంటి నోటీసులు జారీ చేస్తే, పని దినాలు కేటాయించని మిగతా రోజుల్లో ఆయా ఉద్యోగులు ఏం చేయాలనేది ఇప్పటికిప్పుడు జవాబు లేని ప్రశ్నే. లోతుగా యోచిస్తే… ‘అడ్డా కూలీ’ల మాదిరిగా మిగతా రోజుల్లో మరేదైనా సంస్థలో పని చూసుకోవలసిందేనా? జర్నలిస్టు సోదరులారా… మన ‘బతుకు సిత్రం’ అర్థమవుతున్నట్లే కదా! ఎనిమిదేళ్ల క్రితం ఓ న్యూస్ ఛానల్ ఓనర్ చెప్పిన అడ్డా కూలీ ‘సిద్ధాంతం’ మీడియాలో ప్రస్తుతం అమలవుతున్నట్లే కదా? ఇంకా ఏమైనా డౌటుందా??