పొంచి ఉండడం, అనూహ్య స్థలంలో దాడికి తెగబడడం తోడేలు స్వభావం. పక్షుల, జంతువుల స్వభావాన్ని మనిషి అలవర్చుకోరాదన్నది రుగ్వేదపు నీతి. తోడేలు చర్య ఆటవికం. కానీ మనిషిగా చెప్పుకుంటూ, మేథావులుగా తమకు తాము అభివర్ణించుకుంటూ తమలోని తోడేళ్ల స్వభావాన్ని బహిర్గతం చేస్తున్న కొన్ని జర్నలిస్టిక్ కలాలను ఎలా సంబోధించాలి? కాయ కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న రైతులను అరాచక పదాలతో సంబోధిస్తే ఎలా అర్థం చేసుకోవాలి? ‘బాధితుల బద్నాం’ (విక్టిమ్ బ్లేమింగ్) చర్యలకు దిగుతున్న కలాలను ఏం చేయాలి? అనూహ్యంగా రైతులపై తమ రాతలతో దాడి చేసి, పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్న కొందరు సోకాల్డ్ జర్నలిస్టుల రాతలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీయడమే తాజా విశేషం.
రైతులు తోడేళ్లా? కాదు కదా! కానీ తన కలంలో కులం కంపును నరనరాన జీర్ణించుకున్న ఓ జర్నలిస్టు రైతులను తోడేళ్లతో పోలిస్తే ఆ ‘మనీ’షిని ఎలా అభివర్ణించాలి? రైతుల రోదనను, ఆవేదనను, ఆందోళనను క్రూర జంతువుల సామెతకు కొందరు జర్నలిస్టులు అన్వయించడమే తీవ్ర అభ్యంతరకరం. దీన్నే ‘బుర్ర చెడి..భక్తి ముదిరిన’ చందంగా అభివర్ణించారు పదవీ విరమణ చేసిన ఓ జర్నలిస్టు పెద్దాయన.
అప్పుల బాధతో పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకుంటే అతనికి వడ్డీ వ్యాపారాన్ని అంటగడతాడు ఓ సోకాల్డ్ ‘జన్రలిస్టు.’ భూమిని నమ్ముకున్న రైతు వడ్డీ వ్యాపారం చేస్తాడా? వడ్డీ వ్యాపారం చేసేవాడు జనాన్ని పీల్చుకుతింటాడే తప్ప, తన ప్రాణాన్ని ఫణంగా పెడతాడా? వడ్డీ వ్యాపారంలో నష్టం వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలు ఎన్ని ఉన్నాయి? ఇవేవీ తెలియవు గోదావరి ‘పులస’ చేపల రుచికి అలవాటు పడ్డ సదరు ‘సంప్రదాయ’ కలానికి. ఎందుకంటే ముడేసుకున్న మడిని గోదావరి ఒడ్డున ఏనాడో ఒలిచేసి, మద్యానికి బానిసైన సదరు కలం తూలుతూ రాసే రాతలు కాబట్టి.
రైతుకు తెలియని వడ్డీ విద్యలను, తోడేలు స్వభావాన్ని అతనికి అంటగడుతున్న కొన్ని కలాలను ఇంతకన్నా ఇంకెలా బజారుకీడ్చాలి? అమరావతి రాజధానికి సంబంధించి రైతుల ఆందోళన కొన్ని కలాలకు ‘తోడేళ్ల’ పోరాటంగా కనిపించడం జర్నలిజపు దౌర్భాగ్యం కాక మరేమిటి? పదవీ విరమణ చెందాక పాలకులను ప్రసన్నం చేసుకునే ముందస్తు చర్యగా మాత్రమే అభివర్ణించక తప్పదు. రైతులు ఎన్నటికీ తోడేళ్లు కారు.. వాళ్లు భూమి పుత్రులు మాత్రమే. కేవలం మట్టిని నమ్మకున్న కర్షకులు. ఇటువంటి రైతులను తోడేళ్లుగా అభివర్ణించిన సోకాల్డ్ జర్నలిస్టులే ‘అక్షరం ముసుగు కప్పుకున్న తోడేళ్లు’. క్తుప్తంగా ఇప్పటికింతే.