తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో గల పొంగులేటి నివాసంలోనేగాక, హిమాయత్ సాగర్ లోని ఆయన ఫాం హౌజ్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంతేగాక తన కుమార్తె ఇంట్లోనేగాక, బంధువుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ ఉదయం ఐదు, ఆరు గంటల నుంచే పొంగులేటి నివాసంలో, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు వేర్వేరుగా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా మరికాసేపట్లో ఖమ్మంలోని పొంగులేటి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈడీ బృందాలు బయలుదేరినట్లు తెలుస్తోంది. పొంగులేటిపై ఈడీ ఎందుకు దృష్టిని కేంద్రీకరించిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.