తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ‘టార్గెట్’ అయ్యారా? పొలిటికల్ గా పొంగులేటి దూకుడుకు ముకుతాడు వేసే రాజకీయ ఎత్తుగడలు తెరచాటుగా అమలవుతున్నాయా? కేంద్ర దర్యాప్తు సంస్థలు పొంగులేటి వ్యాపార సామ్రాజ్యంపై దృష్టి కేంద్రీకరించి దాడులు చేస్తుండడం సహజంగా జరుగుతున్న ప్రక్రియేనా? విపక్షాల సహజ ఆరోపణల ప్రకారం.. పొంగులేటి సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్వహిస్తున్న దాడులు రాజకీయ కక్షలో భాగమా? ఇటువంటి అనేక ప్రశ్నలపై భిన్న చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంపై, ఆయన కుటుంబ సభ్యుల, బంధువుల నివాసాల్లో, ఆఫీసుల్లో ఈడీ అధికారులు శుక్రవారం చేస్తున్న సోదాల నేపథ్యం ఈ చర్చకు కారణమైంది. ఇంతకీ పొంగులేటి రాజకీయంగా టార్గెట్ అయినట్టేనా?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడచిన దశాబ్ధ కాలంలోనే రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగడం గమనార్హం. సరిగ్గా పదేళ్ల క్రితం 2014లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఖమ్మం ఎంపీగా గెలుపొందడం, మారిన రాజకీయ పరిణామాల్లో ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరడం, 2019 ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ పొంగులేటికి టికెట్ నిరాకరించడం వంటి పరిణామాలు జరిగాయి. అయినప్పటికీ దాదాపు ఐదేళ్లపాటు బీఆర్ఎస్ లోనే కొనసాగిన పొంగులేటి నిరుడు జూలై 2వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని సవాల్ చేసిన పొంగులేటి గత ఎన్నికల సందర్భంగా వేసిన ఎత్తుగడలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గద్దె దిగడానికి దోహదపడ్డాయనే వ్యాఖ్యలున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ దాఖలు చేయడానికి పొంగులేటి సంసిద్ధమైన రోజే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ, మంత్రివర్గంలో చోటు లభించడం, ముఖ్యమైన శాఖలు ఆయనను వరించడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొంగులేటి రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్ 2గా ప్రాచుర్యం పొందారు. రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నట్లు జనం నోళ్లలో నానుతున్న పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు శుక్రవారం దాడి చేయడం సంచలనం కలిగించింది. నిజానికి తమ విద్యుక్త ధర్మంలో భాగంగానే ఈడీ అధికారులు పొంగులేటి నివాసాలపై, ఆఫీసులపై దాడులు చేసి సోదాలు నిర్వహిస్తూ ఉండవచ్చు. కానీ పొంగులేటిపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడిని కుట్రగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటోందని, ఇటువంటి కుట్రలను రాజకీయంగానే ఎదుర్కుంటామని చెప్పారు.
అయితే ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ఖరీదైన వాచీల కొనుగోలు ఘటన తరువాయి దర్యాప్తులో భాగంగా శుక్రవారంనాటి ఈడీ సోదాలుగా తెలుస్తోంది. వాచీల కేసు వ్యవహారంలో కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అదేవిధంగా హర్షరెడ్డికి చెందిన రూ. 1,300 కోట్ల సంపదపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మొత్తం సంపదలో రూ. 600 కోట్ల అనుమానాస్పద లావాదేవీలుగా ఈడీ అధికారులు గుర్తించినట్లు ఆయా వార్తల సారాంశం.
ఇదిలా ఉండగా పొంగులేటికి చెందిన కాంట్రాక్టు సంస్థలు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బాజాప్తాగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. డాక్యుమెంటరీ సాక్ష్యాలతో మహేశ్వర్ రెడ్డి మీడియా సమక్షంలోనే ఈ అంశంపై ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీల అంశంపై మీడియాలోనూ వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో కోణంలోనూ ఈడీ దాడులపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు పొంగులేటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ఫండ్ అంశంపైనా ఈ చర్చ జరుగుతుండడం గమనార్హం. దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఈ రెండు ప్రభుత్వాల్లో కీలక నేతల కదలికలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి కీలక నేతల్లో పొంగులేటి కూడా ఒకరనే వాదన వినిపిస్తోంది.
మొత్తంగా వేల కోట్ల రూపాయల పొంగులేటి వ్యాపార సామ్రాజ్యంపై శుక్రవారంనాటి ఈడీ దాడులు రాజకీయంగా భిన్న కోణాల్లో చర్చకు దారి తీశాయి. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ వెడతాయని బీజేపీ నాయకులు చెబుతున్నప్పటికీ, ఇది రాజకీయ కక్ష, కుట్రగా తెలంగాణా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల సలహా మేరకే పొంగులేటిపై రాజకీయ కక్షలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అవకాశం వస్తే సీఎం సీట్లో కూర్చునే స్థాయికి ఎదిగినట్లు జనం నోళ్లలో నానుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో ఈడీ తాజా దాడులు సరికొత్తగా భిన్న రాజకీయ చర్చకు దారి తీశాయనేది నిర్వివాదం.