తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఐఎస్ అధికారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈనెల 22న తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. గతంలో ఓ జిల్లాకు ‘కలెక్టర్’గా విధులు నిర్వహించిన ఈ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం రాష్ట్ర పశు సంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయనే అమోయ్ కుమార్.. ఐఏఎస్.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాయంలో అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేశారు. అప్పట్లో జరిగిన భూ కేటాయింపుల అంశంలో అమోయ్ కుమార్ ను ఈడీ విచారించే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయల విలువైన భూ కేటాయింపుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా ప్రభుత్వ, భూదాన్ భూములను బదలాయించిన అంశంలో భారీ అక్రమాలు జరిగాయనేది ఆరోపణల సారాంశం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఇతరులకు ధారాదత్తం చేసిన 40 ఎకరాల ప్రభుత్వ భూముల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని అమోయ్ కుమార్ కు ఈడీ సమన్లు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈడీ నిర్దేశించిన తేదీన తనకు ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నాయని అమోయ్ కుమార్ అభ్యర్థించగా, మరుసటి రోజు, ఈనెల 23న విచారణకు రావాలని ఈడీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే అమోయ్ కుమార్ కు సమన్లు జారీ చేసిన అంశంలో ఈడీ గోప్యతను పాటిస్తుండడం గమనార్హం.