సరిగ్గా పది రోజుల క్రితం తెలంగాణా సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ స్థితిపై చెప్పిందేమిటో గుర్తుందా? అయితే ఓసారి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. లేదంటే దిగువన ఓసారి చదవండి.
‘‘దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.., పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది.’’
ఇవీ గతనెల 31వ తేదీన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో సీఎం కేసీఆర్ బీజేపీపైనేగాక ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోయినా, రైతు వేదిక సభను పరోక్షంగా అందుకు వినియోగించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పోలింగ్ తేదీకి సరిగ్గా మూడు రోజుల ముందు జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ చేసిన ఆయా వ్యాఖ్యలపై దుబ్బాక ఫలితం వెలువడిన అనంతరం చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఓ ఉప ఎన్నిక గురించి సీఎం కేసీఆర్ రైతువేదిక సభలో అలా స్పందిస్తారని, వ్యాఖ్యానిస్తారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ రైతువేదిక సభలో దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీని సీఎం తేలిగ్గా తీసిపారేశారు. బహుషా దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ప్రభుత్వ నిఘా వర్గాలతోపాటు, పార్టీ నేతలు సీఎం కేసీఆర్ కు అప్పటికే నివేదించి ఉంటారా? దుబ్బాకలో అధికార పార్టీకి తిరుగే లేదని నివేదికలు సమర్పించి ఉంటారా? లేదా స్వయంగా చేయించుకున్న ఏవేని సర్వేలను ప్రామాణికంగా తీసుకుని ఉంటారా? అందువల్లే సీఎం రైతువేదిక సభలో బీజేపీని తేలిగ్గా తీసుకుని వ్యాఖ్యలు చేశారా? దుబ్బాకలో గెలుపుపై సీఎం ధీమాకు నివేదికలే నిజమైతే అందుకు బాధ్యులెవరు? ఇదీ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ… ఎందుకంటే సీఎం రైతువేదిక సభలో చెప్పిందొకటి… దుబ్బాకలో అధికార పార్టీ చవి చూసిన ఫలితం మరొకటి మరి!