ఈరోజు ‘నమస్తే తెలంగాణా’ పత్రికను చదివారా? ప్రత్యేకత ఏమిటీ అంటారా? తెలంగాణాలో అధికార పార్టీ కరదీపక ‘నమస్తే తెలంగాణా’ పత్రిక గురించి తెలుసు కదా? టీఆర్ఎస్ పార్టీనిగాని, దాని కార్యకర్తనుగాని ఎవరైనా పల్లెత్తు మాటంటే ఉవ్వెత్తున లేస్తుంది. అక్షరాలతో చీల్చి చెండాడుతుంది. అచ్చ తెలంగాణా మాండలికంలో శివాలెత్తుతుంది. ఇందులో తప్పేమీ లేపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ పెద్దలు పత్రికను స్థాపించిన లక్ష్యమే అది. ఎక్కువ ఉపోద్ఘాతం అక్కరలేదు. శాంపిల్ గా సరిగ్గా రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణా’ పత్రిక హెడ్డింగులేమిటో తెలుసా? ‘గెలుపు వాకిట.. గులాబీ జోష్’, ‘రెట్టించిన ఉత్సాహంతో గులాబీ దండు, ప్రచారంలో దూసుకుపోయిన కారు’… ఇవీ నిన్నా, మొన్న ఆ పత్రిక సిద్దిపేట జిల్లా అనుబంధంలో కనిపించిన హెడ్డింగులు. ఈరోజు హెడ్డింగ్ ఏమిటో తెలుసా? ‘ఉద్యమ దుబ్బాక చైతన్య గీతిక’… అంతే!
సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగినా, మరే ఎన్నిక జరిగినా ‘నమస్తే తెలంగాణా’ గతంలో వార్తలకు శీర్షికరించిన విధానం ఇది కాదనేందుకు ఉదాహరణలు అనేకం. పోలింగ్ ముగిసిన అనంతరం తన పాఠకులకు గతంలో అందించిన వార్తా కథనాల విధానం వేరు. ‘టీఆర్ఎస్’కే ఓటర్ల పట్టం, ‘కారు’కే ఎగ్జిట్ పోల్ అనుకూలమంటూ గులాబీ శ్రేణుల్లో సంబురాన్ని నింపే ఉత్సాహభరిత హెడ్డింగులు కనిపించేవి. కానీ నిన్నా, మొన్నా అధికార పార్టీ కార్యకర్తల్లో మాంచి ‘ఊపు’నిచ్చే హెడ్డింగులు పెట్టిన ‘నమస్తే తెలంగాణా’ పత్రికలో పోలింగ్ ముగిశాక ఆ తరహా హెడ్డింగ్ కనిపించకపోవడమే చర్చనీయాంశంగా మారింది.
‘పోలింగ్ కు ముందు ‘ఊపు’నిచ్చే హెడ్డింగులు పెడితే నాలుగు ఓట్లు రాలవచ్చు, కానీ పోలింగ్ ముగిశాక అటువంటి హెడ్డింగుల వల్ల ప్రయోజనం ఏమిటి?’ అని ప్రశ్నించారు ఓ సీనియర్ జర్నలిస్టు మిత్రుడు. నిజమే… కానీ, నిన్న పోలింగ్ ముగిశాక కొన్ని సర్వే సంస్థలు ‘ఎగ్జిట్ పోల్’ ఫలితాలను వెల్లడించాయి. పొలిటికల్ లాబొరేటరీ అనే సంస్థ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేల్చింది. ఇది ‘నమస్తే తెలంగాణా’కు ఏమాత్రం నచ్చకపోవచ్చు. సహజం కూడా.
కానీ ‘థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్’ అనే సంస్థ మాత్రం గులాబీ పార్టీకే ఓటర్లు పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా వెల్లడించింది. అధికార పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత 51.54 శాతం ఓట్లతో తొలిస్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సైతం ‘నమస్తే తెలంగాణా’ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. మెయిన్ ఎడిషన్ లో గాని, జిల్లా అనుబంధంలోగాని కనీసం అనుకూల ఎగ్జిట్ పోల్ గురించి కూడా ఓ అక్షరం రాసినట్లు లేదు. దరిమిలా దీని భావమేమిటనే అంశంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దుబ్బాకలో పోలింగ్ సరళి, మండలాల వారీగా పార్టీలకు లభించనున్న ఓట్లు… అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టును కూడా ఇక్కడ చూడవచ్చు.