దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు సోలిపేట సుజాత, ఎం. రఘునందన్ రావు ల మధ్య హోరాహోరీగా పోరు జరిగిందనే వార్తల నేపథ్యంలో దుబ్బాక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరగ్గా, మరికొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపోటములపై స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ టేబుళ్లపై 23 రౌండ్లపాటు ఈవీఎంలను తెరిచి, ఓట్లను లెక్కిస్తారు.
దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా 1,453 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. వీటిని ముందుగానే లెక్కించనున్నారు.
కాగా దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని రెండు సర్వే సంస్థలు, బీజేపీ గెలుస్తుందని మరో రెండు సర్వే సంస్థలు వేర్వేరుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. దీంతో సహజంానే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై ఈ ఫలితం ప్రభావం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
UPDATE: తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 341 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.