తెలంగాణ రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దుబ్బాక ఉప ఎన్నిక తీర్పు విలక్షణంగా ఉంది. టీఆర్ఎస్ పాతకాపు, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు స్వల్ప ఓట్ల మెజారిటీతో గట్టెక్కి సంచలనం సృష్టించారు. రెండేళ్ల క్రితం తిరుగులేని తీర్పుతో రెండోసారి అధికారంలోకి వచ్చిన అధికార పక్షం టీఆర్ఎస్కు దుబ్బాక తీర్పు స్పీడ్ బ్రేకర్ లాంటిది. తెలంగాణ ఎట్లుండాలో, తెలంగాణకు ఏమి కావాలో… తనకు తానే ఊహించుకొని, నిర్ణయించుకొని, భ్రమించుకొని ఏకపక్షంగా అమలుచేస్తున్న రాజుగారికి ‘అబ్బ..’ అనిపించేదే దుబ్బాక తీర్పు.
దుబ్బాకలో బీజేపీ గెలుపునకు స్థానిక కారణాలు, సమీకరణాలు అనేకం ఉండవచ్చు. అక్కడున్న పరిస్థితులు తక్కిన తెలంగాణలో కనిపించకపోవచ్చు. అయినప్పటికీ దుబ్బాక ఓటరులో మిగతా తెలంగాణ ఓటర్లందరూ ఇప్పుడు తమను తాము ఐడెంటిఫై చేసుకుంటున్నారు. రైతుబంధు డబ్బులు అప్పనంగా పొందుతున్న బడా రైతులు మినహా, మిగతా అన్ని వర్గాల ప్రజలు, ఓటర్లు– దుబ్బాక తీర్పు సరైన సమయంలో సరైన విధంగా వచ్చిందనే భావనను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన ఏకపక్షంగా మారింది. ఇదేమిటని ప్రశ్నించిన వారే లేరు. ప్రశ్నించినా వారిని పట్టించుకున్న నాథుడే లేడు. అలాంటి వారికి బహుమానంగా అవమానాలు, పరాభవాలు అందడం రివాజుగా మారింది. సారు దయతలిచి ఇస్తే మహాభాగ్యం అన్న స్థితికి సమాజం వచ్చినట్టు కనిపించింది. ఇది కేసీయార్‌కు తెలియదనుకోలేం. ఒకరకంగా ఏకపక్ష పాలనను ముందస్తు వ్యూహం ప్రకారమే సాగిస్తున్నట్టు నిర్ధారణలూ జరిగాయి. సెంటిమెంట్‌తో తొలి ఐదేళ్లు పాలన సాగగా, కమిట్మెంట్స్తో మలి ఐదేళ్లకు పునాదులు వేసుకున్నారు. ప్రతిపక్షాల తరపున గెలిచిన లీడర్లు స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పక్షం పంచన చేరారు. దీంతో రెండో టర్మ్‌లో కేసీయార్ స్పీడ్ మరింత పెరిగింది. ఆర్టీసీ సమ్మె అణచివేత, ధరణి పేరుతో తెచ్చిన మార్పులు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు తప్పని సరి ఎల్ఆర్ఎస్.. ఇలా అనేక చర్యలు నియంతృత్వ పోకడలకు అద్దం పట్టాయి.
కేసీయార్ ఏకపక్ష పాలనపై లోలోపల వ్యతిరేకత ఉడుకుతుండగానే, మల్లన్నసాగర్ ముంపుభూముల పరిహారం వ్యవహారం దుబ్బాకలో తోడైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం చెందడంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి సానుభూతి వెల్లువలో ఆయన సతీమణి సోలిపేట సుజాత అలవోకగా గెలిచిఉండాలి. కానీ ఇక్కడ రఘనందన్‌రావు బరిలో ఉండటంతో పరిస్థితి తారుమారైంది. టీఆర్ఎస్ పుట్టుక నుంచి దాదాపు 13 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో కేసీయార్‌తో రఘునందన్ ప్రయాణం సాగించారు. తన సహజమైన వాగ్ధాటి, విషయ పరిజ్ఞానంతో పూర్వ మెదక్ జిల్లా రాజకీయాల్లో సమర్థుడైన నేతగా గుర్తింపు పొందారు.
కేసీయార్ సామాజిక వర్గానికే చెందిన రఘునందన్ ఎదుగుదల.. భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం కనిపించడంతో ఆయనను వ్యూహం ప్రకారం టీఆర్ఎస్ నుంచి బయటకు గెంటివేశారనే అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కృతులైన అనేకమంది ఘనాపాటీలు అడ్రస్ గల్లంతై తెరమరుగు కాగా, రఘునందన్ మాత్రం బీజేపీలో చేరి తన అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. జనంలో ఉంటూ నేతగా ఎదిగారు. 2014 నుంచి మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఉప ఎన్నిక సందర్భంగా సిద్ధిపేటలో రఘునందన్ టార్గెట్‌గా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నా లేనట్టుగానే మిగిలింది. బహుశా.. ఈ కారణాలన్నింటివల్లే సోలిపేట సుజాత కంటే రఘునందన్‌కు సానుభూతి దక్కినట్టుగా కనిపిస్తుంది. యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు రఘునందన్‌కు వెన్నుదన్నుగా నిలిచారనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రలోభాల ఎరతో ఓట్లను దండుకునే ప్రక్రియ ఇక్కడ అధికార పార్టీకి కలిసిరాకపోవడం విశేషంగా కనిపిస్తుంది. అంటే ఓటుకు నోటును మించిన అంశాలేవో దుబ్బాక ఓటరును ప్రభావితం చేసినట్టుగా అర్థం చేసుకోవాలి. దుబ్బాక ఓటరు తీర్పును మెచ్యూర్డ్ జడ్జిమెంట్‌గా భావించడమే కాదు, రాబోయే రోజులకు సంకేతాత్మకంగా, ప్రతీకాత్మకంగా చూడాల్సి ఉంటుందేమో.
హుజూర్నగర్ ఉప ఎన్నికలో స్వయంగా ప్రచారం నిర్వహించిన కేసీయార్… దుబ్బాకకు దూరంగా ఉండటం, హరీశ్‌రావును ముందుపెట్టడంపై ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యానాలు వస్తున్నాయి. దుబ్బాక ఫలితం ముందే ఊహించి కేసీయార్ దూరంగా ఉన్నారా..? హరీశ్‌రావు ప్రభను మసకబార్చేందుకు తెరవెనక కుట్ర జరిగిందా..? అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి. ఇక తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న రఘునందన్‌కు బీజేపీలో ఉజ్వల భవిష్యతు కనిపిస్తోంది. జవసత్వాలు ఉడిగిన కాంగ్రెస్.. కోలుకోవడానికి చాలాకాలం పడుతుంది కాబట్టి, ఈ లోగా తెలంగాణలో బీజేపీ తన పునాదులు పటిష్టం చేసుకుంటుంది. ఈ పటిష్ట ప్రక్రియలో రఘునందన్ పాత్ర కీలకంగా ఉండొచ్చు. ఈ పరిణామం టీఆర్ఎస్ సారథులకు కంట్లో నలుసే.
✍️ శంకర్రావు శెంకేసి