చూశారుగా…? దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ ఇది. ‘పొలిటికల్ లాబొరేటరీ’ అనే సంస్థ పేరున నిర్వహించినట్లు పేర్కొంటున్న ఈ ఎగ్జిట్ పోల్ నివేదిక చెబుతున్న సారాంశం ఏమిటంటే…? దుబ్బాకలో 47 శాతం ఓట్లతో బీజేపీ ముందు వరుసలో ఉందని. అధికార టీఆర్ఎస్ పార్టీ 38 శాతం ఓట్లతో, కాంగ్రెస్ 13 శాతం ఓట్లతో, ఇతరులు 2 శాతం ఓట్ల చొప్పునతర్వాత స్థానాల్లో నిలిచే అవకాశం ఉందని.
సరే, ఈ విషయంలో పొలిటికల్ లాబొరేటరీ అనే సంస్థ చరిత్ర ఏమిటి? దానికి గల నేపథ్యం ఏమిటి? గతంలో ఆ సంస్థ నిర్వహించిన సర్వేల వివరాలేమిటి? వాటికి లభించిన విశ్వసనీయత ఎంత? అనే అంశాలేవీ ఆయా నివేదికలో లేవు. ఈ సర్వే లోని సారాంశాన్ని కాసేపు పక్కన బెడితే, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినా, ఓడినా బీజేపీకి మాత్రం రాజకీయంగా భారీ లబ్ధి కలగవచ్చనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.
వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు బాధ్యత మొత్తాన్ని మంత్రి హరీష్ రావు తన భుజస్కంధాలపై వేసుకున్నప్పటికీ, అనేక పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చాయనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గురించిగాని, ఆ పార్టీ అభ్యర్థి గురించి గాని టీఆర్ఎస్ నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ప్రచార పర్వంలో బీజేపీపై నిప్పులు చెరిగిన స్థాయిలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన సందర్భాలు పెద్దగా లేవు.
నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్ కు ముందు రోజు వరకు కూడా అధికార పార్టీ బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేసింది. మంత్రి హరీష్ రావు నుంచి సీఎం కేసీఆర్ వరకు కూడా బీజేపీనే లక్ష్యంగా చేసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోయినా, కొడకండ్లలో గత నెల 31న రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు విమర్శలు చేశారు. తన ప్రసంగంలో కేంద్రంలో బీజేపీ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను చెప్పేవి అబద్ధాలని రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి ‘రాజీనామా’ చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా మూడు రోజుల ముందు సీఎం ఈ సవాల్ విసరడం గమనార్హం.
ఇక పోలింగ్ కు ముందు జరిగిన వేర్వేరు ఘటనల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల నివాసాలపై దాడులు, డబ్బు సంచి వీడియో వివాదం నుంచి తాజాగా నిన్న రాత్రి సిద్ధిపేటలోని ఓ హోటల్ లో జరిగిన పరస్పర దాడుల ఘటనల వరకు ఉప ఎన్నికల దృశ్యాలు మొత్తం టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ఎక్కువగా జరిగాయి. మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్ పేరుతో ‘పొలిటిలక్ లాబొరేటరీ’ నివేదిక సంగతి ఎలా ఉన్నప్పటికీ, పోటీ మాత్రం అత్యంత రసవత్తరంగా జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీల మధ్యే జరిగినట్లు పక్కా సమాచారం అందుతోంది. అంతమాత్రాన టీఆర్ఎస్ ఓడిపోతుందనే వార్తలను విశ్వసించాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ అధికార పార్టీ నేతలు ఊహించిన మెజారిటీ రాకపోవచ్చంటున్నారు. మరోవైపు బీజేపీ గెలుపు అనూహ్యమైనా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గెలుపుపై ధీమాను కూడా వ్యక్తం చేశారు.
అయినప్పటికీ దుబ్బాకలో అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు… కానీ, మొత్తంగా ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. దుబ్బాకలో బీజేపీ గెల్చినా, ఓడిపోయినా తెలంగాణాలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో ఆ పార్టీకి దుబ్బాకలో హైప్ క్రియేట్ అయిందనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి. ఓ రకంగా అధికార పార్టీ నేతలే ఆ పార్టీకి ఈ స్థాయి హైప్ తెప్పించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీని మాత్రమే టీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా చేసుకోవడమే ఇందుకు ముఖ్య కారణమంటున్నారు. దుబ్బాకలో బీజేపీ గెలవకపోయినా, రెండో స్థానాన్ని ఆక్రమించినా, ఆయా పరిణామాలు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే ప్రచారం మాత్రం అధికార పార్టీ నేతలకు మింగుడు పడని అంశమే కావచ్చు. ఒకవేళ తమ అంచనాలు తప్పి బీజేపీ దుబ్బాకలో విజయం సాధిస్తే మాత్రం అందుకు కారణాలు అనేకం కావచ్చు. ఇంతకీ ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు మాత్రం మరో వారం రోజులపాటు అంటే ఓట్లు లెక్కించే 10వ తేదీ వరకు వెయిట్ అండ్ సీ… అంతే.
UPDATE:
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టినట్టు వివరించింది. మొత్తం 51.54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు తొలిస్థానం లభించినట్టు తెలిపింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33.36 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 8.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడోస్థానంలో ఉన్నట్టు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ వెల్లడించింది.