మూతికి మాస్క్ ధరించి ఓ చెక్క బల్లపై కూర్చుని, కళ్లు మూసుకుని సేద తీరుతున్న ఈ పోలీస్ పేరు ఇబుంచా. పోలీస్ అంటే సాదా సీదా కానిస్టేబుల్ కాదు. అక్షారాలా ఐపీఎస్ అధికారి. అంతేకాదు పీహెచ్ డీ డాక్టరేట్ పట్టా కూడా ఉంది. మొత్తంగా డాక్టర్ ఇబుంచా. మణిపూర్ రాష్ట్ర కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లా ఎస్పీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.
డాక్టర్ ఇబుంచా పేరు చెబితే రాజకీయ నేతలకు, మాఫియా ముఠాలకు, రౌడీ గ్యాంగులకు హడల్. రూ. 130 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకుని మాదక ద్రవ్యాల రవాణా మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన చరిత్ర డాక్టర్ ఇబుంచా సొంతం. చిత్తశుద్ధికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా మణిపూర్ రాష్ట్రంలో పేరు గాంచిన డాక్టర్ ఇబుంచా కరోనా కట్టడి చర్యల్లో స్వయంగా పాల్గొంటున్నారు. వీధి వీధినా తానే మైక్ తీసుకుని ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. దయచేసి వీధుల్లోకి రాకండి, లాక్ డౌన్ పాటించండి, కరోనా మహమ్మారిని పారదోలండి అంటూ తన గొంతే కాదు… మైకు కూడా బొంగురుపోయేలా తానే స్వయంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లోనే డాక్టర్ ఇబుంచా కరోనా విధుల్లో పాల్గొన్న అనంతరం తన నివాసంలోకి కూడా వెళ్లడం లేదు. విధుల్లో భాగంగా వీధుల్లో సంచరించిన తనకు కరోనా వైరస్ అంటుకుంటే, అది తన కుటుంబం పాలిట శాపంగా మారకూడదన్నది డాక్టర్ ఇబుంచా ఉద్దేశం. అందుకే కరోనా విధుల్లో అలసి, సొలసి ఇదిగో ఇలా తన నివాసం బయటే కళ్లు మూసుకుని, కాసేపు సేద తీరుతూ దీర్ఘాలోచనలో నిమగ్నమయ్యారు. కరోనా కట్టడికి ప్రజలను చైతన్యపరుస్తూ ఎస్పీ ఇబుంచా వీధుల్లో స్వయంగా ఎలా ప్రచారం చేస్తున్నారో దిగువన వీడియోలో చూడండి.