దిగువన గల వీడియోను నిశితంగా చూడండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ‘సీన్’గా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో ఇదీ ఒకటి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టభద్రులను సమీకరించి ఇక్కడే సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారట. అంటే… ఓటుకు ముందే నోటు, అల్పాహారం, నోరూరించే భోజనం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే వంటలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయమా? లేక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా? అంటూ విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటువంటి అనేక వీడియోలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఇల్లెందు సీఆర్ క్లబ్ లో, బూర్గంపాడు మండలంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్న వీడియోలు అనేకం బహిర్గతమయ్యాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది అసలు ప్రశ్నే కాదు. అదంతా చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియ. కానీ సరిగ్గా పోలింగ్ రోజే నగదు ‘పంచుడు’ కార్యక్రమాన్ని ఎంచుకున్న అధికార పార్టీ నేతల వైఖరి వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముంచేస్తుందా? ఇదీ తాజా సందేహం. ఎందుకంటే…!
సాధారణంగా ‘పోల్ మేనేజ్మెంట్’గా వ్యవహరించే ప్రక్రియలో రాజకీయ పక్షాల నగదు ‘పంచుడు’ దందా కూడా ఉంటుందనేది ఓటర్లకు తెలియనిదేమీ కాదు. కానీ ప్రణాళికాబద్ధంగా జరగని ‘పంచుడు’ కార్యక్రమం ‘పల్లా’ పాలిట శాపంగా మారినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. తమకు డబ్బు అందలేదని పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థి ఇంటిముందే ధర్నాకు దిగిన దృశ్యాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేకం కనిపించాయి. ఈ నేపథ్యంలో డబ్బుకోసం డిమాండ్ చేసే ఓటరు చెడ్డవాడా? దాన్ని పంపిణీ చేేసే పార్టీ మంచిదా? అనేది చర్చ కానేకాదు. కాకపోతే అధికార పార్టీ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పంపిణి చేసినట్లు పేర్కొంటున్న డబ్బు పట్టభద్రులైన ఓటర్ల జేబుల్లోకి చేరలేదనే సమాచారమే ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైనట్లు తెలుస్తోంది. పోలింగ్ కు ఓ రోజు ముందే ‘పంచుడు’ ప్రక్రియ ముగించాలని సంస్థాగతంగా వచ్చిన ఆదేశాలను స్థానిక నేతలు విస్మరించడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఈ పంచుడు ప్రక్రియలో అధికార పార్టీ నేతలు ఈసారి తప్పులో కాలేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నేరుగా ఓటరు వద్దకు వెళ్లకుండా, సభల తరహాలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి నగదు పంచడమే పుట్టి ముంచిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేగాక స్థానిక నేతలకు ‘పంచుడు’ బాధ్యతను అప్పగించకుండా కొందరు కళాశాల బాధ్యులకు అప్పగించారని అంటున్నారు. తమకు చాయ్ డబ్బులు కూడా మిగల్చకుండా ఎక్కడి నుంచో కొందరు కాలేజీ వ్యక్తులను పంపి నగదు పంపిణీ చేయడమేంటని స్థానికి లీడర్లు ఆగ్రహించారని, దీంతో డబ్బు పంపిణీ పలుచోట్ల రసాభాసగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేల అనుయాయులే పంచుడు బాధ్యతలను తీసుకుని, పోలింగ్ రోజువరకు వేచి ఉండడం వెనుక కూడా బలమైన స్వార్థం ఉందంటున్నారు. ఫంక్షన్ హాళ్లలో, మామిడితోట్లలో ‘జాతర’లా ఏర్పాటు చేసిన పంచుడు కార్యక్రమాలకు ప్రజలు భారీగా వచ్చారని, దీంతో గ్రాడ్యుయేట్లు ఎవరో? సామాన్యులెవరో? తెలియని అయోమయ స్థితి నెలకొందంటున్నారు. ఇదే సమయంలో కొందరు స్థానిక నేతలే ఉద్దేశపూర్వకంగా పంచుడు ప్రక్రియను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, మీడియాకు, పోలీసులకు షేర్ చేయడం వెనుక కూడా పకడ్బందీ ప్రణాళిక ఉందంటున్నారు. ఫలితంగా పంచుడు బాగోతం రచ్చగా మారి పోలీసులు రంగప్రవేశం చేస్తారని, దీంతో ‘పంచుడు’ కోసం తమకు అప్పగించిన నగదు తమ వద్దే భద్రంగా ఉంటుందని కొందరు నేతలు పన్నాగం పన్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇల్లెందులోని ఓ క్లబ్బులో జరిగినట్లు పేర్కొంటున్న ‘పంచుడు’ ప్రక్రియలో అభ్యర్థి ఓటమికి దారితీసే విధంగా వ్యవహరించారంటున్నారు. ఇందుకు బలం చేకూర్చే విధంగా సంభాషణలు వినిపిస్తున్న ఆయా వీడియోను దిగువన చూడవచ్చు.
‘పంచుడు’ ప్రాసెస్ లో కొందరు స్థానిక నేతల స్వార్ధం వల్ల అధికార పార్టీ అభ్యర్థికి అనూహ్యంగా డిగ్రీహోల్డర్ల నుంచి ప్రతికూలత ఎదురైనట్లు కూడా మరో కథనం ప్రచారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు నియోజకవర్గాల్లో సాధారణ ఓటర్లకు సైతం రూ. 2,000 చొప్పున ఇచ్చారని, డిగ్రీ చదువుకున్న తమకు రూ. 1,000 ఇవ్వడమేంటనే అంశంపై కొందరు పట్టభద్రులు అసంతృప్తిని వ్యక్తం చేశారంటున్నారు. ఇస్తామన్న రూ. వెయ్యి కూడా సక్రమంగా ఇవ్వకుండా మరికొన్ని ప్రాంతాల్లో రూ. 500లకే పరిమితం చేశారని, మిగతా మొత్తాన్ని స్థానిక నేతలు, పంపిణీదారులు జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా రకరకాల విన్యాసాలకు, వివాదాలకు దారి తీసిన నగదు ‘పంచుడు’ కార్యక్రమం అధికార పార్టీ అభ్యర్థి ‘పల్లా’ రాజేశ్వర్ రెడ్డిని నిండా ముంచదు కదా? అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫొటో: బూర్గంపాడులో గ్రాడ్యుయేట్లకు టీఆర్ఎస్ నేతలు నగదు పంచుతున్న దృశ్యం.