కొన్ని సంఘటనలు ఎప్పటికీ మరపురావు. చరిత్రకు అవి సాక్షీభూతంగా నిలుస్తుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ను చూస్తే చాలు… పందొమ్మిదేళ్ల క్రితంనాటి ఘటన ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటుంది. ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో ఇదో సంచలనాత్మక ఉదంతం. అప్పటి ఈ ఘటన ఇప్పటికీ పోలీస్ స్టేషన్ ముందు నుంచి నేరుగా పయనించే ‘మార్గం’ లేకుండా చేసిందంటే ఆశ్చర్యం కాదు. ఏటూరునాగారం-హన్మకొండ ప్రధాన రహదారిని రెండు దశాబ్ధాలుగా ‘మలుపులు’ తిప్పిన ‘డైరెక్షనల్ మైన్స్’ సంఘటన ఇది. ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే అథారిటీ విభాగాలకు చెందిన అధికారులు ఎన్నిసార్లు అడిగినప్పటికీ, ఇప్పటికీ మెయిన్ రోడ్డుపై పయనించేందుకు పోలీసులు క్లియరెన్స్ ఇవ్వడం లేదంటే అప్పటి ఘటన తీవ్రతను అవగతం చేసుకోవచ్చు. ఇందుకు భద్రతా కారణాలే ప్రధానం కావచ్చు. అప్పటి సంచలన ఉదంతాన్ని సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్, మిత్రుడు వెంకటరమణ మరోసారి కళ్లముందు సాక్షాత్కరింపజేశారు. ఆసక్తికర కథనం. ఇక చదవండి.
ములుగు ఏజెన్సీలో సంచలనం సృష్టించిన మరో సంఘటన పీపుల్స్ వార్ చేసిన డైరెక్షనల్ మైన్స్ తో ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ను పేల్చివేత ప్రయత్నం. నిషేధిత పీపుల్స్ వార్ తీవ్రవాదులు మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా ట్రాక్టర్ లో అమర్చిన డైరెక్షనల్ మైన్స్ ద్వారా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ను పేల్చివేయడానికి చేసిన ప్రయత్నం యావత్ దేశంలో సంచలనం రేకెత్తించింది.
ఇక వివరాలకొస్తే… 2001 సంవత్సరం జులై 29 న అప్పటి జిల్లా గిరిజన సంక్షేమాధికారి రషీద్ (మా నల్లగొండ వాస్తవ్యులు) ఆహ్వానంపై ఏటూరు నాగారం వెళ్లి, కొన్ని సక్సెస్ స్టోరీస్ కలెక్ట్ చేసుకొని అతని ఇంట్లోనే రాత్రి బస చేసాను. తెల్లారి ఆరు గంటల ప్రాంతంలో అప్పుడే లేస్తుండగానే పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఆ… ఏదో మైనింగ్ బ్లాస్ట్ అనుకుని ఉండగానే, అటెండర్ పరుగున వచ్చి ‘పోలీస్ స్టేషన్ పై నక్సలైట్లు దాడి చేశారట సార్, మొత్తం ఉద్రిక్తంగా ఉంది, చాలా మంది చనిపోయారని అంటున్నారు, ఆ మార్గం మొత్తం సీజ్ చేశారు’ అని చెప్పారు.
దాంతో ఒక్కసారిగా మొఖం కడుక్కొని పోలీస్ స్టేషన్ వైపు పోదామని ప్రయత్నిస్తే పోలీసులు ఆ మార్గాన్ని మొత్తం అదుపులోకి తీసుకొని ఎవరినీ రాకుండా క్లోజ్ చేశారు. ఐటీడీఏ అధికారులం అని చెప్పి అక్కడికి వెళ్లి చూడగానే అక్కడే ఉన్న హనుమాన్ దేవాలయంలో పూజారికి తీవ్ర గాయాలైనాయని, ఆయనను కమలాపూర్ ఆసుపత్రికి తరలించారని, ఈ సంఘటనను సెంట్రీ గా ఉన్న జవాన్లు, డ్యూటీ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ లు తిప్పి కొట్టడంతో వార్ నక్సలైట్ల ప్రయత్నం విఫలమైందని అప్పటికే ఆ సంఘటనను కవరేజి చేయడానికి వచ్చిన ఏటూరు నాగారం విలేకరులు వివరించారు.
ఏటూరు నాగారం ఏరియా పీపుల్స్ వార్ దళ నాయకుడైన మధు ఆధ్వర్యంలో ఈ డైరెక్షనల్ మైన్స్ ప్రయోగం మొదటి సారిగా జరిగిందని తెలియచేసారు. ఈ సంఘటనలో సెంట్రీగా ఉన్నపోలీసుల అప్రమత్తంతోనే పెద్ద ముప్పు తప్పింది. ఈ సందర్బంగా సెంట్రీతో పాటు ఎస్.ఐ. ఎదురుకాల్పులు జరపగా ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. సమీపంలో ఉన్న ఐటీడీఏ గెస్ట్ హౌస్ కూడా దెబ్బతిన్నది. ఈ సంఘటన తెలియగానే అప్పటి కలెక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి వెంటనే బయలుదేరి ఉదయం పది గంటలవరకల్లా ఏటూరు నాగారం చేరుకున్నారు.
మొట్టమొదటిసారిగా చేసిన ఈ ప్రయోగం విఫలమైనా ఇది సంచలనం సృష్టించింది. అయితే ఈ సంఘటనకు ముందు జరిగిన విషయం అత్యంత ఆసక్తికరంగా ఉంది. స్థానిక విలేకరుల కథనం ప్రకారం… ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ను డైరెక్షనల్ మైన్స్ తో పేల్చివేయడానికి జరిగిన సంఘటనకు ఒక రోజు ముందుగా, పేలుడు పదార్థాలతో కూడిన ట్రాక్టర్ ను తుపాకులగూడెం వైపు నిషేధిత పీపుల్స్ వార్ తీవ్రవాదులు వెళ్తుండగా ఏటూరునాగారం శివార్లలో జరిపిన సోదాలలో పోలీసులు పట్టుకున్నారు. అయితే సరైన పోలీసు ఫోర్స్ లేకపోకపోవడంతో పేలుడు పదార్థాలు కలిగిన ట్రాక్టర్ తో పోలీసులను ఏమార్చి నక్సలైట్లు తప్పించుకున్నారని, ఇదే ట్రాక్టర్ పై ఇనుప గుండ్లు (ఫిరంగులలో ఉపయోగించేటివి మాదిరి ) డ్రమ్ములో అమర్చి, చుట్టూ పేలుడు పదార్థాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ పేల్చివేతకు ప్రయత్నించారని స్థానిక విలేఖరులు చెప్పారు.
రెండు ట్రాక్టర్లలో వచ్చి ఒకటి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ఆపి అందులోని డ్రైవర్ గుడిలో పూజలు చేస్తున్నట్టు నటిస్తూ పేల్చివేశారని, అది గురి తప్పి ఆ గుడిలోని పూజారికి తగిలి తీవ్రంగా గాయపడడంతో హన్మకొండలోని ఎంజీఏంకు తీసుకువెళ్లి చికిత్స చేయించగా మరణించారు. ఈ పేలుడుకు ఐటీడీఏ గెస్ట్ హౌజ్ లోని రెండు భారీ యూకలిప్టస్ చెట్లు మధ్యకు తెగి పడ్డాయి. 500 మీటర్ల దూరంలో ఉన్న ఫారెస్ట్ గార్డుకు కూడా గాయాలయ్యాయని మరుసటి రోజు వచ్చిన పేపర్లలో కూడా వార్తా కథనాలు వచ్చాయి. ఈ సంఘటనను ధైర్యంగా ఎదుర్కున్న అప్పటి ఎస్.ఐ. కిరణ్ కుమార్, సి.ఐ. తిరుపతిలకు జాతీయ పోలీస్ మెడల్స్ కూడా లభించాయి. శాఖ పరమైన పనిపై వెళ్లి విజయ గాధలకై సమాచారం, ఫోటోలను సేకరించి అక్కడే రాత్రి బస చేయడంతో దేశ వ్యాప్త సంచలనం సృష్టించిన సంఘటనను ప్రత్యక్షంగా చూడడం జరిగింది.
✍️ కన్నెకంటి వెంకట రమణ,
డిప్యూటీ డైరెక్టర్; సమాచార, పౌర సంబంధాల శాఖ