బతుకమ్మ పండుగలో ‘సద్దులు’ ఎన్నడనే అంశంపై తెలంగాణాకు చెందిన పురోహితులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో సద్దుల బతుకమ్మ ఏరోజున నిర్వహించాలనే విషయంపై సందిగ్ధావస్థ కొనసాగుతోంది. సద్దుల బతుకమ్మను 13న జరుపుకోవాలని కొందరు పండితులు, కాదు… కాదు 14నే నిర్వహించాలని మరికొందరు పురోహితులు సూచిస్తున్నారు. అయితే వాస్తవానికి సద్దుల బతుకమ్మ నిర్వహణ అంశంపై శాస్త్రాల్లోగాని, గ్రంథాల్లోగాని ఎక్కడా స్పష్టం చేయలేదని ఇంకొందరు సిద్ధాంతుుల సెలవిస్తున్నారు. ‘సద్దుల బతుకమ్మ’ నిర్వహణ తేదీపై తెలంగాణా ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖ పురోహితులు ఏమంటున్నారంటే….

ఈనెల 13వ తేదీనే సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించాలని వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం సిద్ధాంతి అనంత మల్లయ్య శర్మ చెబుతున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే….‘ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఏ రోజున చేసుకోవాలి అనే మీమాంస నెలకొంది. నిజానికి బతుకమ్మ పండుగ గురించి ధర్మ శాస్త్ర గ్రంథాలలో ఎక్కడా చెప్పబడినట్టుగా లేదు. ఇది వారి వారి ఆచారాన్ని అనుసరించి పితృ అమావాస్య ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం చేసుకుని కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిది రోజులు నిర్వహించుకునే పండుగగా వ్యవహరింపబడుతుంది. గురు మదనానంద సరస్వతీ పీఠాధిపతులు అయిన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు గత నాలుగైదు సంవత్సరాల క్రితం తెలంగాణ విద్వత్ సభలో మాట్లాడుతూ.. చద్దులబతుకమ్మ పండుగను నిర్ణయం చేస్తూ, బతుకమ్మ పండుగను ఎవరు ఎన్ని రోజులు ఆడిన దుర్గాష్టమి లోపే పూర్తి చేయాలని నిర్ణయం చేసినారు. దుర్గాష్టమి రోజున రాత్రివేళలో బలిప్రదానములు ఇచ్చే సంప్రదాయం మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున. పుష్పగౌరి వ్రతం చేసుకున్న వాళ్లంతా దుర్గాష్టమి రోజుననే పూల గౌరమ్మను నిమజ్జనం చేయాలని. దుర్గాష్టమి రోజున బలిప్రదానములు చేసి బతుకమ్మను నిమజ్జనం చేయకుండా ఉంటే శ్రేయస్కరమని తెలియజేశారు. ఈ విషయాన్ని ఆనాడు పండితులు, పామరులు, సిద్ధాంతులు కూడా ఆమోదించారు. ఈ ప్లవనామ సంవత్సరంలో జరిగిన విద్వత్ సభలో పండితులు సిద్ధాంతులు ఏకీకృతమై ఈ నెల 13వ తేదీ బుధవారం రోజునే చద్దుల బతుకమ్మ పండుగను ఆచరణ చేసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. కావున యావన్మంది ప్రజలు ఈ నెల 13వ తేదీ బుధవారం రోజుననే చద్దుల బతుకమ్మ పండుగను చేయవలసిందిగా తెలియజేయుచున్నాము’ అని మల్లయ్య శర్మ వివరించారు.

అదేవిధంగా ప్రముఖ తెలుగు భాషా సేవకుడు, అవధాని, కవి మాడుగుల నారాయణ మూర్తి మాట్లాడుతూ, సద్దుల బతుకమ్మ అమావాస్యనాడు మొదలైందని, లోకాచారం ప్రకారం ఏడు, తొమ్మిదవ రోజుల్లో మాత్రమే చేస్తారని చెప్పారు. కానీ తిథి, వార, నక్షత్రాల గణన లేదన్నారు. మంగళ, గురువారాల్లోనే ఈ ఏడాది సద్దుల బతుకమ్మను నిర్వహించాని స్పష్టం చేశారు.

మరోవైపు సద్దుల బతుకమ్మ పండుగను ఈ నెల 14న జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ జనగామ జిల్లా కమిటీ సూచించింది. ఈమేరకు జనగామలో జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకొంది. జనగామ జిల్లా బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు, యాదగిరిగుట్ట ఆస్థాన సిద్దాంతి కృష్ణమాచార్య సిద్ధాంతి పంచాంగం ప్రకారం 14న సద్దులు, 15న దసరా పండుగలు జరుపుకోవాలని కమిటీ తీర్మానించింది.

సద్దుల బతుకమ్మ నిర్వహణపై అయోమయం వద్దని కొడకండ్లకు చెందిన సిద్ధాంతి పాలకుర్తి గౌతమ్‌ శర్మ చెబుతున్నారు. గత ఆరు దశాబ్ధాల పంచాంగాలను, పండుగల నిర్ణయాలను పరిశీలించి పెద్దలతో చర్చించిన తర్వాత ఈఏడాది సద్దుల బతుకమ్మను 14న జరుపుకోవడమే సరైనదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ఉందని, శాస్త్రాల్లో పుష్పగౌరీ వ్రతంగా అభివర్ణించినా శాస్త్రపరంగా ఎలాంటి ప్రత్యేక వివరణలు, ఆధారాలు లేవన్నారు.

Comments are closed.

Exit mobile version