ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వర్గీయులు పరస్పర ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే ఈ ఘటన జరగడం గమనార్హం. పార్టీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా మండల, గ్రామ కమిటీలను ప్రకటించే సమయంలో ఎమ్మెల్యే వర్గీయులుగా ప్రాచుర్యం పొందిన ద్వితీయ శ్రేణి నేతలు, వారి అనుచరులు ఈ ఘర్షణకు పాల్పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అందిన సమాచారం ప్రకారం… నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మరికొన్ని గ్రామ కమిటీలను ప్రకటించేందుకు స్థానిక నాయకులు కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

గ్రామ కమిటీలను ప్రకటించే అంశంలో ఏర్పడిన వివాదం వాగ్వాదంగా మారి, ఆ తర్వాత ఘర్షణకు దారి తీసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పరస్పర దాడులకు దిగినట్లు పేర్కొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెల్చిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version