ఒక్కోసారి కొన్ని దృశ్యాలు కొన్ని అనూహ్య మార్పులకు, పరిణామాలకు దారి తీస్తుంటాయి. అది కొన్ని సంస్థల సిబ్బందిలోని సృజనాత్మకతను లేదా మేథస్సును వెలికి తీసేందుకు కూడా దోహదపడుతుంటాయి. ఇదిగో ఇప్పడు మీరు చూస్తున్న ఫొటో కూడా ఈ కోవలోకే వస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్నకడప జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు జగన్ పేరు చెబితేనే ఒంటికాలిపై లేచి ఆరోపణలు, విమర్శలు గుప్పించే నేతగా ప్రాచుర్యం పొందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోమవారం అనూహ్య రీతిలో వ్యవహరించారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జగన్ ను రమేష్ కలిసినప్పటి చిత్రమిది. తనకు శాలువా కప్పి, సత్కరించి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న సీఎం రమేష్ ను చూస్తూ జగన్ నవ్వుతున్న అరుదైన దృశ్యమిది. ఈ ఫొటోను సాక్షి దినపత్రిక ప్రచురించడం సహజమే కావచ్చు.
కానీ ఈ ఫొటో ప్రచురించే ముందు ఎడిటోరియల్ విభాగానికి చెందిన కీలక వ్యక్తి ఒకరు తీసుకున్న ఓ నిర్ణయమే జర్నలిస్టు సర్కిళ్లలో ఇప్పుడు హాట్ టాపిక్ కావడం విశేషం. వాస్తవానికి పత్రికల్లో ప్రచురితమయ్యే అనేక ఫొటోలకు రైటప్ (ఫొటో దిగువ భాగాన రాసే విషయం), పైన ప్రచురించే హెడ్డింగ్ (శీర్షిక) ను రిపోర్టర్లు రాస్తుంటారు. అవసరమైన చోట సబ్ ఎడిటర్లు దిద్దుతుంటారు. ఈ పొటోను కూడా అదే తరహాలో సాక్షి పత్రికలో ప్రచురించారని భావిస్తే పప్పులో కాలేసినట్లే.
ఒకప్పటి చంద్రబాబు కుడిభుజం, ప్రస్తుతం బీజేపీలో గల సీఎం రమేష్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి శాలువా కప్పి, చేతులుజోడించి నమస్కరించడం తాజా రాజకీయ పరిణామాల్లో అత్యంత అరుదైన దృశ్యమే. ‘కడప జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు శాలువా కప్పి నమస్కరిస్తున్న సీఎం రమేష్’ అని ఈ ఫొటోకు సాధారణ శీర్షికను వాడవచ్చు. ఇలాగే రాస్తే అరుదైన దృశ్యపు ఫొటోకు అన్యాయం చేసినట్లే అవుతుంది. ఇందులో సందేహం లేదు.
అందుకే సాక్షి ఏపీ ఎడిషన్స్ చూసే రెసిడెంట్ ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వినూత్నంగా ఆలోచించారు. ఆయా ఫొటోను సాక్షి అంతర్గత వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసి, మంచి శీర్షిక రాసి పంపిన వారికి రూ. 1,000 నగదు బహుమతిని ప్రకటించారు. తన సొంత డబ్బును విజేతకు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇందుకు సమయం ఇచ్చారు. వినూత్నంగా, విశేషంగా పాఠకులను ఆకర్షించే విధంగా ఫొటో శీర్షిక ఉండాలని కోరారు. ఏపీలోని రిపోర్టర్లకు, సబ్ ఎడిటర్లకు ఓ రకంగా పరీక్ష పెట్టారు.
దాదాపు నలభై వరకు వచ్చిన శీర్షికల్లో అత్యుత్తమంగా భావించినదాన్ని ఎంపిక చేసిన పత్రిక ఎడిటర్ మురళి విజేతను ప్రకటించారు. ‘ఉక్కు మనిషీ..నమో నమ:’ అంటూ ఓ సీనియర్ సబ్ ఎడిటర్ రాసిన శీర్షికను ఆయా ఫొటోకు వాడారు. పత్రికకు చెందిన డెస్క్ సిబ్బంది, రిపోర్టర్ల మేథో సంపత్తిని వెలికి తీసేందుకు ఇదో మంచి ప్రయత్నం కావచ్చు. కానీ అంతగా శ్రద్ధ తీసుకుని వాడిన అరుదైన దృశ్యపు ఫొటోను ఎక్కడో రెండో పేజీలో, సింగిల్ కాలమ్ లో, ఓ మూలన పడేసినట్లు ప్రచురించడమే సాక్షి అసలు ప్రత్యేకత కాగా, ఇటువంటి శీర్షికలకు బహుమతి ఒరవడిని కొనసాగించాలని నిర్ణయించడం విశేషం.