రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక మిరాకిల్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకే కాదు, ఎవరికైనా ఈ వ్యాపారం ఒక అద్భుతమైన ఆదాయ వనరు. ఒక ప్లాటు కొని పెట్టుకుంటే భవిష్యత్తులో నిశ్చింతగా ఉండవచ్చనే భరోసా నుంచి నాలుగు ప్లాట్లు ఉంటే జీవితాంతం ఇక డోకా లేదనే స్థాయికి సగటు మనిషిని చేర్చింది. కరోనా మూలంగా అన్ని వ్యాపారాలు కుదేలైపోయినా, రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే ఒడిదొడుకులు లేకుండా సాగడానికి కారణం అదే. కొనుగోలుదారులకు భరోసాను, అమ్మకందారులకు రాబడిని, మధ్యవర్తులకు కమీషన్లను, రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభుత్వం సంస్కరణల కొరడా ప్రయోగించి చోద్యం చూస్తోంది. తాను తీసుకోబోయే చర్యల పర్యవసానాలను బేరీజు వేసుకోకుండానే ఏదో చేయబోయి మరేదో చేసి ప్రజలతో ఆటలాడుకుంటోంది. సర్కారు చర్యల పుణ్యమాని రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా చతికిలపడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వ్యాపారంపై ఆధారపడిన అనేక వర్గాల వారు అతలాకుతలం అవుతున్నారు. సర్కారు బొక్కసానికి వేల కోట్ల ఆదాయం చేజారింది. ప్లాటు ఉందని ఇన్నాళ్లు నిశ్చింతగా గడిపిన సామాన్యుడు అవసరానికి అమ్ముకోలేక ఆగమాగం అవుతున్నాడు. దాదాపు మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు అంటూ ప్రకటించింది. తీరా చూస్తే పాత పద్ధతి పాక్షికంగా కనిపిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడిన వారు రోడ్డెక్కక తప్పలేదు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సర్కారు వారు తీసుకున్న నిర్ణయాలపై వివిధ వర్గాల వారి ప్రశ్నలు, వ్యాఖ్యానాలు, హితవుల సమాహారం ఇది… ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 102, రెవిన్యూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తేదీ 7-9 -2020 న రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 5 ద్వారా కలిగిన అధికారాలతో సెప్టెంబర్ 9 నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పాక్షికంగా మూసివేసింది. తిరిగి 14-12-2020న పాత పద్ధతి అంటూ మళ్లీ తెరిచింది.
అసలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 5 ప్రకారం అధికారం కలిగి ఉన్నదా? ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సమంజసమేనా?
ఎల్ ఆర్ ఎస్, బిఆర్ఎస్ లేని ప్లాట్లను ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయకూడదని రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల నెంబరు G2/ 257/ 2019 తేదీ 26 -8-2020 నకు చట్టబద్ధత ఉన్నదా? అసలు ఈ ఉత్తర్వులు జారీ చేసే అధికారం కలిగి వున్నదా? ఇలాంటి ఉత్తర్వులకు రిజిస్ట్రేషన్ చట్టం అనుమతిస్తుందా?ఇది చట్టాల అతిక్రమించిన అధికార దుర్వినియోగం కాదా?
పంచాయతీ రాజ్ చట్టం 2018, మున్సిపల్ చట్టం 2019 కి రిజిస్ట్రేషన్ చట్టాన్ని అధిగమించకలిగే అధికారం ఏమైనా పై చట్టాలలో పొందుపరచబడినదా?
పంచాయతీ రాజ్ చట్టం 2018లో జారీ చేసినప్పటికీ మున్సిపల్ చట్టం 2019 లో జారీ చేసినప్పటి నుండి లేఅవుట్ కానీ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు ఎందుకు నిరోధించలేదు.?
అకస్మాత్తుగా 08-09 -2020 నుండి వీలునామాలు తప్ప రిజిస్ట్రేషన్స్ నిలిపివేయడం ఎంతవరకు సబబు చర్య?
చాలామంది ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం చలానాలు బ్యాంకులో చెల్లించారు. చలానాల గడువు సమయం నాలుగు నెలలు మాత్రమే. ఈ పరిస్థితిలో గడువు దాటిన చలనాలకు వెసులుబాటు ఏమి కల్పించలేదు.
రిజిస్ట్రేషన్ ఫీజు బ్యాంకులో చెల్లించిన వారికి సరైన అవకాశం ఇవ్వకపోవడం సంబంధిత పార్టీల హక్కు తిరస్కరించినట్లు కాదా?
చాలామంది ప్రజలు రిజిస్ట్రేషన్ అవుతుంది అని క్రయ విక్రయ లావాదేవీలు జరిపారు. అడ్వాన్సుగా కొంత మొత్తం కూడా తీసుకున్నారు. కూతురు వివాహానికి లేదా మెడికల్ ఖర్చులకు అమ్ముకొని అడ్వాన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకపోతే ఖరీదు దారులు రిజిస్ట్రేషన్ కావడంలేదని చెల్లించిన మొత్తం ఇవ్వమని కోరితే అమ్మినతను ఖర్చు చేసుకొని ఉంటే, ఇవ్వలేని పరిస్థితి, ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఈ క్లిష్టమైన పరిస్థితిలో అమ్ముకున్న వాడి పరిస్థితి ఆత్మహత్యా సదృశ్యమే.
రిజిస్ట్రేషన్ శాఖ 2000వ సంవత్సరం నుండి కార్డు ప్రాజెక్టు కింద అన్ని సేవలు అందిస్తున్నది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ ఖచ్చితమైన సేవలు అందించడానికి సుమారు 20 సంవత్సరాల కాలవ్యవధి అవసరమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కార్డు ద్వారా అందుతుండగా, కార్డు ప్రాజెక్టును రద్దు పరిచి ధరణి ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎవరి కోసం?
అసలు ధరణి ప్రభుత్వ కంపెనీయా.. ప్రైవేట్ కంపెనీయా?
నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్లు డెవలప్ చేసిన కార్డును కాదని ధరణి ద్వారా సర్వీసెస్ అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడానికి గల కారణం ఏమిటి?
నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కన్నా ధరణి ఏ విషయంలో మెరుగైనది, మేలైనది?
రిజిస్ట్రేషన్ శాఖ అందించే సర్వీసులు అత్యవసర సర్వీసుల కిందకు రాకున్నా ఎసెన్షియల్ సర్వీస్ కిందికి రావా?
ప్రభుత్వం తీసుకున్న ఈ తొందరపాటు చర్య / నిర్ణయం ద్వారా ప్రజలు ఇబ్బందుల పాలు కావడం లేదా? ప్రభుత్వానికి రాబడి తగ్గలేదా?
ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ తహసిల్దార్లకు బాధ్యత అప్పగించి వెనువెంటనే పట్టాదారు పాసు బుక్కు ఇస్తామని గవర్నమెంట్ చాలా గొప్పగా ప్రగల్భాలు పలికింది. కానీ రిజిస్ట్రేషన్ అయినా ఒక నెల వరకు కూడా కొనుగోలుదారులకు పట్టాదారు పాస్ బుక్కులు రాలేదు… ఇది నిజం కాదా?
ధరణి అగ్రికల్చర్ ల్యాండ్ పోర్టల్ లోనే ఒక విక్రయ దస్తావేజు నమూనాను పొందుపరిచి దస్తావేజు ప్రతిని ధరణి ద్వారా పొందేలా చేసిన విధానం బాగానే ఉంది. అయితే ధరణిలో ఉన్న నమూనాలు అమ్మకం దారులకు ఆస్తి ఎలా సంక్రమించింది తదితర వివరాలు రాసుకునే అవకాశం లేదు. ధరణిలో పేరు నమోదు అయింది కాబట్టి అక్కడి నుండి అమ్మకందారునకు యాజమాన్యపు హక్కులు సంక్రమించినట్లుగా తయారు చేశారు. దస్తావేజు ఎలా రాయించి ఎలా రాసుకోవాలి అన్న విషయం కొన్న వారి ఇష్టం. కొన్నవారికి దస్తావేజు ఎలా రాసుకుంటే చట్టబద్ధత కలుగుతుందో బ్యాంకు ద్వారా రుణం పొందవచ్చునో, లేక కోర్టు లో వాద ప్రతివాదాలు వచ్చిన తన హక్కును ఎలా సంరక్షించుకోవచ్చు అనే బాధ్యత కచ్చితంగా కొనుగోలు దారుడి దే. ఇందులో ప్రభుత్వ జోక్యం/ప్రమేయం అవసరం లేదు. దస్తావేజు ఎలా ఉండాలనేది పార్టీల హక్కు.
ధరణి ద్వారా క్రయ /దాన/ తనఖా దస్తావేజులకు మాత్రమే అవకాశం కల్పించారు. కానీ వీటికే ఇంకా మోక్షం రాలేదు మిగతా దస్తావేజులకు ఎన్ని సంవత్సరాలకు చోటు కలుగుతుందో భగవంతుడికే ఎరుక.
ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 131, తేదీ 31- 8 -2020 ద్వారా ఎల్ఆర్ఎస్ స్కీం ప్రవేశపెట్టింది. ఈసారి సుమారుగా 25 లక్షల దరఖాస్తులు రెగ్యులరైజేషన్ కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ మాసంలో దరఖాస్తు ల స్వీకరణ నిలుపుదల చేశారు. కానీ విచిత్రమేమిటంటే ఇంతవరకూ శుభారంభాన్ని కూడా నోచుకోలేదు ఎంత సమయం పడుతుందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ఒకవేళ ఆ అవసరం ఉన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ రుసుము మొత్తాన్ని చెల్లించినా, ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు ప్రభుత్వం వెంటనే ఇచ్చే పరిస్థితిలో ఉందా? అని అడిగితే కచ్చితంగా లేదు అనే సమాధానం. అలాంటప్పుడు అత్యవసర పరిస్థితి ఇ ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమిటి?
ఇన్ని ఇబ్బందులు, సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ఎంతవరకు సబబు పెద్దలు ఆలోచించాలి.
డిసెంబరు 14 నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ ప్రకటించి ఆఫీసులు తెరిచింది. కానీ కొన్ని రకాల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. ఇక పాత పద్ధతి అన్నదానికి అర్థమేమిటి?
ఇప్పటికైనా అవసరాలు ప్రయోజనాలు సంక్షేమ కార్యక్రమాలు గుర్తెరిగి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పాత పద్ధతిలో కార్డు ప్రాజెక్టు ద్వారా ప్రారంభించాలి.
✍️ శంకర్రావు శెంకేసి