కొందరు ప్రభుత్వ అధికారులు తమ పదవీ కాలంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఇటువంటి సమయాల్లోనే అటువంటి అధికారులకు అసలు కష్టాలు మొదలవుతాయి. తమకు తాముగా సృష్టించుకున్న వివాదాస్పద సంఘటనలు వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి. ఇందుకు నిదర్శనమే పొరుగున గల ఛత్తీస్ గఢ్ లోని ఓ అటవీ అధికారి స్విమ్మింగ్ పూల్ వ్యవహారం.
దాదాపు మూడేళ్ల క్రితం సుక్మాలో డీఎఫ్ఓగా విధులు నిర్వహించిన రాజేష్ చాండ్లే అనే అటవీ అధికారి ప్రభుత్వ అధికారిక నివాసంలో విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ నిర్మించిన సంఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకోసం రూ. 70 లక్షల నిధులను వినియోగించారని, మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని 2016లోనే డిమాండ్లు వచ్చాయి. జాతీయ మీడియాలో ఈ అంశంపై అప్పట్లో భారీ ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్ బాగోతం చర్చనీయాంశంగా మారింది. కానీ అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రభుత్వం ఈ స్విమ్మింగ్ పూల్ వివాదాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు కూడా వచ్చాయి.
కానీ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా? డీఎఫ్ఓ రాజేష్ చాండ్లేకు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి సుక్మా డీఎఫ్ఓగా ఆయన నిర్మించిన స్విమ్మింగ్ పూల్ వివాదం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ఇదో పెద్ద కుంభకోణమని, దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ సుక్మా కాంగ్రెస్ నేత వికాస్ తివారీ ఛత్తీస్ గఢ్ అటవీ శాఖ మంత్రి మో అక్బర్ కు సోమవారం లేఖ రాశారు. రమణ్ సింగ్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల్లో ఇది కూడా ఒకటని, సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీంతో దర్యాప్తు జరపాలని అటవీ శాఖ మంత్రి మో అక్బర్ ఫారెస్ట్ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ను ఆదేశించారు.