శుక్రవారం రాత్రి ఖమ్మం నగర ప్రజలు ఊపిరాడని పొగలో చిక్కుకున్నారు. ఈ పరిణామం మున్సిపల్ అధికారి ఒకరి నిర్బంధానికి కారణమైనట్లు సమాచారం. నగరంలోని దానవాయిగూడెం వద్ద గల డంపింగ్ యార్డును మున్సిపల్ సిబ్బంది తగులబెట్టారనే ఆరోపణలు ప్రజల నుంచి వచ్చాయి. ఫలితంగానే ఖమ్మం నగరంలోని టూ టౌన్, వన్ టౌన్ ప్రాంతాలు డంపింగ్ పొగలో చిక్కుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
ఖమ్మం నగరంలోని రామన్నపేట, దానవాయిగూడెం, ఎన్జీవోస్ కాలనీ, బీసీ కాలనీ, రమణగుట్ట, గాయత్రీ నగర్, రాపర్తి నగర్, మామిళ్ల గూడెం, బుర్హాన్ పురం, మయూరి సెంటర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో ప్రజలు ఊపిరాడక సతమతమవుతున్నారు.
ఖమ్మంలో సగం నగరం మేర డంపింగ్ తగుగలబడుతున్న పొగ కమ్ముకున్న ఫలితంగా ప్రజలకు శ్వాస కూడా ఆడని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలపై ఆగ్రహించిన ఎన్జీవోస్ కాలనీ, బీసీ కాలనీలకు చెందిన ప్రజలు మున్సిపల్ అధికారి ఒకరిని నిర్బంధించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్విరాన్మెంట్ అధికారిగా పేర్కొంటున్న శ్రీనివాస్ ను స్థానికులు నిర్బంధించి ఆందోళనకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల్లోనే టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాగా దానవాయిగూడెం నుంచి గతంలోనే తరలించిన డంపింగ్ యార్డును గత కొంత కాలంగా మళ్లీ కొనసాగిస్తుండడం గమనార్హం. నగరం నుంచి దూర ప్రాంతానికి తరలించిన డంపింగ్ యార్డును మళ్లీ యథాస్థానంలో కొనసాగించడమేగాక, రాత్రి వేళ నిప్పంటించిన కారణంగా కమ్ముకున్న డంపింగ్ పొగలొ ఖమ్మం నగర వాసులు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నారు.
ఫీచర్డ్ ఇమేజ్: ఎన్జీవోస్ కాలనీ వద్ద స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్న దృశ్యం