గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టంలో 5 సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు శాసన సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టానికి ప్రభుత్వం ఐదు సవరణలు చేసింది. ఈ బిల్లును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా రూపొందుతుందని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ఘనమైన చరిత్ర ఉన్నదని, సీఎం కెసిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో జీహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కీటీఆర్ మాట్లాడారు. సమైక్య పాలనలో హైదరాబాద్ అభివృద్ధిని పాలకులు పట్టించుకోలేదని కేటీఆర్ వెల్లడించారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కీసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
జీహెచ్ఎంసీ చట్టంలో ఐదు సవరణలు ఇవీ :
1. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్రత్యేక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. బీసీల రిజర్వేషన్లు యధాతథంగా కొనసాగుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
2. జీహెచ్ఎంసీ పరిధిలో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కూడా సభ ఆమోదం తెలిపింది. గతంలో 2.5 శాతం ఉన్న గ్రీన్ బడ్జెట్‌ను 10 శాతానికి పెంచుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో 5 నుంచి 6 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్రం ఓ నివేదిక విడుదల చేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్ కవర్‌కు కేటాయించామన్నారు. 85 శాతం మొక్కలు బతకాలనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పజెప్పామన్నారు. పంచాయతీరాజ్, పురపాలక చట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చట్ట సవరణలో మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాన్ని హరితనగరంగా మార్చేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందన్నారు.
3. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులో భాగంగా 10 ఏళ్లకోసారి రిజర్వేషన్ల మార్పునకు సభ ఆమోదం తెలిపింది. మాటిమాటికి రిజర్వేషన్లు మార్చడం వల్ల ప్రజాప్రతినిధులకు జవాబుదారీ తనం లేకుండా పోతోంది. రెండు టర్మ్‌లు ఒకే రిజర్వేషన్ ఉండేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టంలో తీసుకువచ్చాం. అదే పాలసీని జీహెచ్ఎంసీ యాక్ట్‌లో చేర్చుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీని వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువై అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
4. నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీల ఏర్పాటుకు సభ ఆమోదం తెలిపింది. ప్రజల భాగస్వామ్యంతోనే నాలుగు రకాల కమిటీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శక్తివంతమైన అస్ర్తంగా ఈ కమిటీలను తయారు చేయబోతున్నామని చెప్పారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకే వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వార్డు కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. యూత్ కమిటీ, మహిళా కమిటీ, సినీయర్ సిటిజెన్ కమిటీ,ఎమినెంట్ సిటిజెన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. కమిటీల్లో అన్ని వర్గాల వారికి అవకాశం వస్తుంది. మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహిస్తాం. కమిటీల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
5. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎస్ఈసీ సంప్రదించాలని జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేశారు. దీనికి కూడా సభ ఆమోదం తెలిపింది.