తెలంగాణా పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు మరో రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. ఈ కూల్చివేత పనులు ఇప్పటికే తొంభై శాతానికి పైగా పూర్తయ్యాయి. శిథిలాలను కూడా వేగంగా తొలగిస్తున్నారు. కూల్చివేత సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశముండటంతో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించలేదు.
అయితే కూల్చివేత వార్తల సేకరణకు అనుమతించాలని మీడియా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడంతో సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఐదు బస్సుల్లో వెళ్లి సచివాలయం కూల్చివేత పనులను పరిశీలించారు.
సచివాలయం కూల్చివేత పనులను మంగళవారం నాటికి 90% పూర్తి చేశారు. ఏ, బీ, సీ, డీ, హెచ్ నార్త్, హెచ్ సౌత్, కే బ్లాకులను పూర్తిగా నేలమట్టం చేశారు. జే, ఎల్ బ్లాక్లను సైతం సగానికి పైగా కూల్చివేశారు. మరో రెండ్రోజుల్లో పాత భవనాల కూల్చివేత పనులన్నీ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. భవనాల కూల్చివేత సమయంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు.