ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. లిక్కర్ పాలసీ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండడని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.
దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడుతానని ప్రకటించారు. దేశాన్ని బలహీనపరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరు నెలలపాటు తీహాడ్ జైల్లో గల కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం విడుదలైన సంగత తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.
ఆప్ నుంచి మరో వ్యక్తి సీఎం అవుతారని, ఇందుకోసం రెండు, మూడు రోజుల్లో పార్టీ సమావేశం జరుగుతుందని ప్రకటించారు. తాను తాజాగా ప్రజా తీర్పు కోరుతానని, ప్రజలే అంతిమ నిర్ణేతలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమ పార్టీని ముక్కలు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనను జైలుకు పంపారని, కానీ ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ ఆప్ ను విచ్ఛిన్నం చేయలేకోయిందన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసమే తాను ఇన్నాళ్లుపాటు పదవికి రాజీనామా చేయలేదన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టే ప్రశ్నించిందని, జైలు నుంచీ ప్రభుత్వాన్ని నడపవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిందని కేజ్రీవాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.