బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తామని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తద్వారా కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ప్రకటించారు. రూ. 8,888 కోట్ల టెండర్లను ఎవరు దక్కించుకున్నారో చెప్పాలని పొంగులేటి కేటీఆర్ ను డిమాండ్ చేశారు. గత ప్రభుత్వమే టెండర్లను రూ. 3,616 కోట్ల చొప్పున మూడు ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించిందన్నారు. గత ఎన్నికల పోలింగ్ తేదీకి సరిగ్గా ఒక్కరోజు ముందుగా గత ప్రభుత్వమే ఈ టెండర్లను కట్టబెట్టిందని మంత్రి పొంగులేటి అన్నారు.
రూ. 8,888 కోట్ల మొత్తాలకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేనిపక్షంంలో కేటీఆర్ రాజీనామా చేస్తారా? అని పొంగులేటి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరుతో రూ. 39 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, ప్రభుత్వం పిలిచిన రీ టెండర్లలో గతంకన్నా రూ. 54 కోట్ల తక్కువకే బిడ్లు దాఖలయ్యాయని చెప్పారు. టెండర్లు వేయవద్దని ప్రభుత్వంలోని పెద్దలు ఎవరినీ, ఏ కంపెనీని బెదిరించలేదని, పాలేరులో తనపై పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డికూడా ఒకటి దక్కించుకున్నారని పొంగులేటి చెప్పారు. ఆధారాలతో విమర్శలు చేయాలని, అవి విమర్శనాత్మకంగా ఉండాలని పొంగులేటి కేటీఆర్ కు హితవు పలికారు.