కరోనా మహమ్మారి ప్రభావం దేవుళ్ల అలంకరణపైనా పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణాలోని జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గల వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయంలోని దుర్గామాతను దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఏటా విశేషరీతిలో భక్తులు అలంకరిస్తుంటారు.
మూడేళ్ల క్రితం ఈ అమ్మవారికి 3 కోట్ల 33 లక్షల 33 వేల 333 రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. రెండేళ్ల క్రితం కిలో బంగారు కిరీటాన్ని కూడా భక్తులు సమర్పించారు. కానీ ఈసారి కరోనా కారణంగా అమ్మవారి అలంకరణలో కరెన్సీ నోట్ల విలువ తగ్గిపోవడం గమనార్హం. పది, 20, 100, 200, 500 విలువైన నోట్లను కాగితం పువ్వుల్లాగా తయారు చేసి దండలు, పుష్ఫగుచ్చాలతో, దుర్గామాతను అలంకరించారు.
ఈసారి ఆయా అలంకరణ నోట్ల విలువ 1 కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలకు తగ్గిపోయింది. గతంకన్నా ఘనంగా అమ్మవారిని అలంకరించాలని భక్తులు తాపత్రయపడినా కరోనా ప్రభావం వల్ల 1,11,11,111 రూపాయల మొత్తంతోనే అలంకరణను సరిపుచ్చాల్సి వచ్చిందట.
ఆయా అలంకరణకు సంబంధించిన వీడియోలను మహిళా జర్నలిస్ట్ ఉమా సుధీర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దిగువన మీరూ చూసేయండి.