తెలంగాణా సీఎం కేసీఆర్ అనూహ్యంగా సంచలన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పరిశీలకుల అంచనాలకు అందని విధంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని ప్రకటించారు. సోమవారం ఆమె అధికార పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు మరోసారి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఒకానొక దశలో ఈ స్థానం నుంచి పోటీకి అధికార పార్టీ దూరంగా ఉండవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే పోటీ చేయకుంటే ప్రతికూల చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో మాజీ ప్రధాని కుమార్తెను తమ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడం విశేషం.