మీ క్రెడిట్/డెబిట్ కార్డు డేటా భద్రంగానే ఉందా? ఎందుకైనా మంచిది ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే భారతీయ బ్యాంకులకు చెందిన దాదాపు 13 లక్షల క్రెడిట్/డెబిట్ కార్డుల వివరాలు అత్యంత ప్రమాదంలో పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కార్డుల డేటాను హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు. ఒక్కో క్రెడిట్/డెబిట్ కార్డు ధర వంద డాలర్లు మాత్రమే. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 7,500. హ్యాకర్లు అమ్మకానికి పెట్టిన ఈ కార్డుల అంశం దేశవ్యాప్తంగా లక్షలాది మంది బ్యాంకు ఖాతాదారులను కలవరానికి గురి చేస్తోంది. ఈ కార్డులను హ్యాకర్లు డార్క్ వెబ్ లోని జోకర్స్ స్టాష్ షాప్ ద్వారా విక్రయానికి పెట్టారు. సైబర్ సెక్యూరిటీ అధ్యయనం ప్రకారం ఈ కార్టులను “INDIA-MIX-NEW-01” శీర్షిక ద్వారా విక్రయానికి ఉంచడం గమనార్హం. తస్కరణకు గురైన కార్డుల్లో 98 శాతం భారతీయ బ్యాంకులకు చెందినవిగా సమాచారం. ఇదో పెద్ద కార్డు డంప్ గా సెక్యూరిటీ రీసర్చ్ విభాగం అంచనా వేస్తోంది. మరో విశ్లేషణ ప్రకారం తస్కరణకు గురైన కార్డుల వివరాలను స్కిమ్మింగ్, స్వైపింగ్ మెషీన్ల నుంచి హ్యాకర్లు పొంది ఉంటారని తెలుస్తోంది. ట్రాక్ 2 ద్వారా కూడా కార్డు స్ట్రిప్ డేటా ఉన్నట్లు తెలుస్తోంది. కార్డుల డేటాను కొనుగోలు చేసినవారు క్లోనింగ్ పద్ధతి ద్వారా సంబంధిత బ్యాంకు ఖాతాల నుంచి నగదును విత్ డ్రా చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా జాతీయ మీడియా విశ్లేషిస్తున్నది.
కాగా ఈ తరహా సైబర్ నేరాలు గతంలోనూ జరిగినట్లు దాఖలాలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో 21.50 లక్షల డెబిట్/క్రెడిట్ కార్డుల డేటాను చోరీ చేసిన హ్యాకర్లు ఇదే జోకర్స్ స్టాష్ లో అమ్మకానికి పెట్టారు. అయితే అప్పట్లో జరిగిన ఈ ఘటనలో చోరీకి గురైన కార్డుల డేటా యావత్తూ అమెరికన్లకు చెందినవి కావడం గమనార్హం. అదేవిధంగా గత ఆగస్టులో కూడా మరో 53.00 లక్షల కార్డులను హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు. గడచిన అయిదేళ్లుగా హ్యాకర్లు తస్కరించిన కార్డుల డేటాను జోకర్స్ స్టాష్ లో ఇదే తరహాలో విక్రయానికి పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తమ చీకటి వ్యాపారానికి హ్యాకర్లు వాల్ మార్ట్, బ్రిటిష్ ఎయిర్ వేస్, లార్డ్ అండ్ టేలర్ వంటి ప్రముఖ కంపెనీలను టార్గెట్ చేస్తున్నట్లు గతంలో జరిగిన ఘటనల ద్వారా వెల్లడైంది. ఈసారి చోరీకి గురైన 13.00 లక్షల కార్డుల్లో భారతీయ బ్యాంకులకు చెందిన 98 శాతం కార్డుల డేటా కోసం ఏయే వ్యాపార సంస్థలను హ్యాకర్లు టార్గెట్ చేశాయన్నది తేలాల్సి ఉంది.